ద కారం దైత్యనాశకం. ఉ కారం విష్ణు నాశకం. ర్ కారం రోగ నాశకం. గ కారం పాప నాశకం, ఆ భయనాశక వాచకం. అందుకే ఆ “దుర్గా మాత నామాన్ని ఉచ్ఛరించినా, స్మరించినా సర్వ పాపాలూ నశిస్తాయి. అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు చాలా ప్రీతికరమైనవి. ఈ పది రోజులూ బెజవాడ కనకదుర్గమ్మ దశావతారాలలో భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై సాక్షాత్కరిస్తుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా వేడుకలను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రులు ఏటా వైభవంగా జరుగుతుంటాయి. కనీసం 15లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయదశమి రోజున దుర్గాదేవిని హంసవాహనంపై ఊరేగిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ తెప్పోత్సవాన్ని చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జై భవానీ.. జైజై జగజ్జననీ…!
పరమ దుర్మార్గుడైన మహిషాసురుడి బారినుంచి దేవతలనూ మనుషులనూ రక్షించేందుకు ఘోర యుద్ధం చేసి అతడిని వధించింది దుర్గాదేవి. ఆ సమయంలో మహోగ్రంగా కనిపిస్తున్న ఆ తల్లిని చూసిన దేవతలందరూ అమ్మా నీవు లోకాలను రక్షించే తల్లివి .. ఇంతటి ఉగ్ర రూపం మహిషాసురుని వంటి రాక్షసవధకే గానీ మేమెట్లు భరించగలం, శాంత రూపిణివై లోకాలను కాపాడమని వేడుకున్నారు. అప్పుడా తల్లి కరుణారస సంపూర్ణ అయిన రాజ రాజేశ్వరీ దేవిగా అవతరించింది. నాటి నుంచి ప్రతి సంవత్సరమూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకూ జరిగే శరన్నవరాత్రోత్సవాలలో నన్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలూ, సుఖ శాంతులూ కలుగుతాయని వరమిచ్చింది. అయితే అనంత రూపిణి అయిన అమ్మవారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్కడేంయ మహర్షికి ఓ సందేహం వచ్చింది. నేరుగా బ్రహ్మదేవుడిని కలిశాడు. దాంతో సాక్షాత్తూ సృష్టికర్తే నవదుర్గా రూపాలను వర్ణించాడు. జగన్మాత సకల చరాచర జగత్తును సృష్టించేందుకు శ్రీదుర్గ, మహాలక్ష్మీ, సరస్వతి, గాయత్రి, శారదాదేవి రూపాలను ధరించింది. ఈ పంచ రూపాలలో అది ప్రకృతిస్వరూపం కనుక దుర్గమ్మ మహిషాసురుణ్ని సహరించిన తరువాత పవిత్ర కృష్ణా తీరంలోని ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా అవతరించింది. సాధారణ రోజుల్లో కంటే ఈ పది రోజుల్లో కనకప్రభలతో వెలసిన దుర్గమ్మను దర్శించుకునే భక్తులకు కోటి రెట్లు పుణ్యం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa