పచ్చిమ ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండే ఆలయం ఎంతో ఆకర్షణీయంగా కంటికి రమణీయంగా ఉంటుంది. ఈ ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండానికి ప్రత్యేక చరిత్రే ఉంది.
నెమలిగుండ్ల రంగనాయక స్వామిని దర్శించుకునే భక్తులు ఈ గుండంలో స్నానం ఆచరిస్తారు. ఈ ఆలయం గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో ఉంది. ఆలయ సమీపంలో దట్టమైన నల్లమల్ల అరణ్యప్రాంతం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ.
ఇక్కడ ప్రతి శనివారం జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. అలానే తలనీలాలు సమర్పించి నీటి గుండంలో స్నానం ఆచరిస్తారు.
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఆలయంలోకి అంటూ ముట్టు, నిష్టగా లేకుండా ఆలయం లోకి ప్రవేశిస్తే తేనెటీగలు కుట్టి ఆలయం నుంచి భక్తులను బయటకు తరిమివెస్తాయి అని పలుమార్లు నిరూపించబడింది. అందుకే ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధ నిష్టలతో స్వామివారిని దర్శించుకుంటారు.
ఇక ఆలయ సమీపంలో ఉన్న నీటి గుండం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మయూర మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ ఘోర తపస్సు చేసాడు. ఆయన తన ముక్కుతో మట్టిని తవ్విన ప్రదేశంలో గుండం ఏర్పడిందని, సూర్యోదయానికి ఆ గుండంలో నీరు కూడా దర్శనమిచ్చిందని పూర్వీకులు నమ్ముతారు.
ఈ నీటి గుండం ఇంతవరకు ఎంత లోతుగా ఉందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. పచ్చిమ ప్రకాశం మొత్తం కరువుకాటకాలతో అల్లాడిపోయినా ఈ గుండంలో మాత్రం నిరంతరం నీరు దర్శనమిస్తుంది. గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద జన్మించిన గుండ్లకమ్మ వాగు శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి పాదాలకు తాకినట్టుగా గుండానికి చేరుతుంది.
నల్లమల అటవీ ప్రాంతంలో ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయంలో ఉండే శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అంశగా భావిస్తారు. అలానే అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని పోలి ఉన్నట్లుగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే రంగస్వామి తిరుణాలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa