వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిపై శాస్త్రవేత్తల పరిశోధనలు విజయవంతమవుతున్నాయి. ఒకరి అవయవాలను మరొకరికి అమర్చడం ఈ రోజుల్లో సర్వ సాధారణమైనా.. అవయవాల కొరత, దీర్ఘకాలం సరిగ్గా పనిచేయకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడానికి దశాబ్దాలుగా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో భాగంగా గతేడాది అక్టోబరులో పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే వైద్యశాస్త్రంలో మరో అద్భుతం జరిగింది. సకాలంలో అవయవాలు దొరక్క అవస్థలు పడుతున్నవారికి గొప్ప ఊరట కలిగించేలా.. మనిషికి పంది గుండెను విజయవంతంగా మార్పడి చేశారు. అమెరికాలోని బాల్టిమోర్ మేరీలాండ్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ వైద్యులు బృందం నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమయ్యింది. పంది నుంచి తీసిన గుండెను డేవిడ్ బెన్నెట్ అనే 57 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను అమర్చి అతడి ప్రాణాలను నిలిపారు. సంప్రదాయ గుండె మార్పిడికి పరిస్థితి అనుకూలించకపోవడంతో ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. శస్త్రచికిత్సకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీచేసింది. ప్రస్తుతం డేవిడ్ బెన్నెట్ కోలుకుంటున్నారని, ఎలాంటి సమస్యలు తలెత్తలేదని అన్నారు. కానీ, మరి కొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని పేర్కొన్నారు. ఆయన పూర్తిగా కోలుకుంటే మనిషి సాధించిన అద్భుతమైన విజయాలలో ఇదొకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. తాజాగా ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైతే భవిష్యత్తులో అవయవాల కొరతకు చెక్ పడొచ్చు. గతేడాది న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్‌లో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కిడ్నీని అమర్చారు. పంది కణాల్లో చక్కెర శాతం వల్ల మానవ శరీరానికి వాటి అవయావాలు సరిపోలడం లేదు. దీంతో జన్యు సవరణను కలిగిన జంతువు నుంచి అవయవాన్ని సేకరించారు. దానిలోని చక్కెరను తొలగించి రోగనిరోధక వ్యవస్థపై దాడిని నివారించేలా మార్పులు చేశారు. అనంతరం రక్తనాళాల జతకు పంది కిడ్నీని శాస్త్రవేత్తలు జోడించి, రెండు రోజుల పాటు పరిశీలనలో ఉంచారు. ఈ కిడ్నీ వ్యర్థాల వడపోతను సమర్థవంతంగా నిర్వహించి, మూత్రాన్ని ఉత్పత్తి చేసింది. అవయవాల కొరతతో అమెరికాలో ఏడాదికి 6 వేలమందికిపైగా ఏటా మృత్యువాత పడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 1.10 లక్షల మందికిపైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. తొలిసారిగా 1984లో కోతిజాతికి చెందిన బబూన్ గుండెను చిన్నారికి మర్చారు. ఆపరేషన్ విజయవంతమైనా ఆ శిశువు 20 రోజుల తర్వాత చనిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa