గ్లామర్ పాత్రల్ని వదులుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఒకప్పటి కథానాయికలు పెద్దగా ఇష్టపడేవాళ్లు కాదు. ‘అమ్మ’గా కనిపించాలంటే వాళ్లకు మరీ భయం. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. పాత్ర నచ్చితే, కథ బాగుంటే.. ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా రెడీ అంటున్నారు. తాజాగా కాజల్ కూడా ఇలాంటి విభిన్నమైన ప్రయాణమే చేయబోతోందని తెలుస్తోంది. తేజ దర్శకత్వంలో వెంకటేష్ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కథానాయికగా కాజల్‌ని ఎంచుకున్నట్టు సమాచారం. ఆమె ఇందులో ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించబోతోందట. తేజ అంటే కాజల్‌కి ఎనలేని గౌరవం. తన తొలి చిత్రం ‘లక్ష్మీ కల్యాణం’కి తేజనే దర్శకుడు. ‘నేనే రాజు నేనే మంత్రి’తో కష్టకాలంలో ఓ విజయాన్ని అందించారు. కేవలం తేజ కోసమే కాజల్ ఈ సాహసం చేస్తోందని, వెంకీతో పాటు కాజల్ పాత్ర కూడా ధీటుగా ఉండబోతోందని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాకోసం కాజల్ తన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికం తీసుకోబోతోందట. అదెంత అనేది మాత్రం బయటకు చెప్పడం లేదు.