|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 03:58 PM
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. ఆ తర్వాత అందరం కూర్చుని చర్చించి, ఆ నిర్ణయాన్ని సవరించామని తెలిపారు.టిక్కెట్ ధరలు పెంచవలసి వస్తే, 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలనే షరతు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు కొన్ని సినిమాలకు టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అయితే, దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.నల్గొండ, భువనగిరి జిల్లాలలో పర్యటిస్తున్న సమయంలో ఒక సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ జీవో వచ్చిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో తాను మరో కార్యక్రమంలో ఉన్నానని వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏ శాఖల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోరని, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారని ఆయన వెల్లడించారు.