|
|
by Suryaa Desk | Mon, Jan 12, 2026, 07:10 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ అన్నదాతలకు తీపి కబురు అందించింది. సన్న వడ్లు సాగు చేసిన రైతులకు ప్రకటించిన క్వింటాకు 500 రూపాయల బోనస్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ తాజాగా 500 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్లో సన్న రకం వడ్లు పండించిన రైతులకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన 500 కోట్ల రూపాయలతో కలిపి.. ఈ సీజన్లో ఇప్పటి వరకు ప్రభుత్వం మొత్తం 1,429 కోట్ల రూపాయల బోనస్ నిధులను విడుదల చేసినట్లయింది.
రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను నమోదు చేసుకుని, మద్దతు ధరతో పాటు బోనస్ మొత్తాన్ని కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. పండుగ సమయంలో చేతికి డబ్బులు అందనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి ఖర్చులకు, పండుగ అవసరాలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలవనున్నాయి. తెలంగాణను సన్న బియ్యం హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టింది.
మార్కెట్లో సన్న బియ్యానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని.. రైతులు దొడ్డు రకాల కంటే సన్న రకాలను ఎక్కువగా సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే క్వింటాకు 500 రూపాయల అదనపు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు గ్రామాల్లోనే ఐకేపీ, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ ధాన్యం పోసిన కొద్ది రోజుల్లోనే నిధులు విడుదలయ్యేలా పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ కాగా.. ఒకటి లేదా రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 30 లక్షల టన్నులకు పైగా సన్న వడ్ల సేకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పారదర్శకమైన కొనుగోలు ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు బోనస్ అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.