|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 08:17 PM
రాష్ట్రంలో ఈనెల 11వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేస్తోంది. మొత్తంగా 336 వార్డుల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారంలో మునిగిపోతున్నారు. అయితే ఈనెల 7, 8వ తేదీల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ .. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు ఇటీవల.. ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. అయితే పవన్ తెలంగాణ పర్యటన రద్దు అయినట్లు తాజాగా బీజేపీ ప్రకటించింది.
అయితే ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్.. అటు జనసేన పార్టీ తరఫున మాత్రమే కాకుండా బీజేపీ అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 8వ తేదీన నల్గొండలో నిర్వహించనున్న తమ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని బీజేపీ ముందే ప్రకటించింది. కానీ పవన్ పర్యటన రద్దు అయినట్టు తాజాగా వెల్లడించింది.
ఈనెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ ప్రకటించింది. దీనికి సంబంధించి.. అభ్యర్థులకు బీ-ఫారమ్‌లు దాఖలు చేయగా.. ఆయా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా వారి నామినేషన్లను ఆమోదించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు.. గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు అని ప్రకటన విడుదల కాగానే ఆయా అభ్యర్థులు సంతోషంలో మునిగిపోయారు. తమ తరఫున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే.. విజయావకాశాలు అధికంగా ఉంటాయని ఆశపడ్డారు. కానీ.. వ్యక్తిగత కారణాలతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
తెలంగాణలోని జిల్లాల వారీగా జనసేన పోటీ చేసే వార్డుల సంఖ్య
మొత్తం వార్డులు: 336
నిజామాబాద్-48
కొత్తగూడెం-22
రంగారెడ్డి-21
ఖమ్మం-17
వరంగల్-20
నల్గొండ-46
మహబూబ్‌నగర్-44
మహబూబాబాద్-5
మెదక్-18
కరీంనగర్-56
ఆదిలాబాద్-39