ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేవలం రూ.26 లక్షలకే హైదరాబాద్‌లో ఫ్లాట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 07:43 PM

హైదరాబాద్‌ నగరంలో ఇల్లు కొనడం సామాన్యుల కలగా మారుతున్న ఈ రోజుల్లో.. గచ్చిబౌలి వంటి ప్రైమ్ ఏరియాలో రూ.26 లక్షలకే ఫ్లాట్ అందుబాటులోకి రావడం భారీ చర్చకు దారితీసింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. తక్కువ ధరలో సొంతింటి కలను నెరవేర్చేలా గచ్చిబౌలి కేంద్రంగా కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. గచ్చిబౌలిలోని రామ్కీ టవర్స్ సమీపంలో.. AIG హాస్పిటల్ పక్కన, రామ్కీ CEO క్వార్టర్స్ దగ్గర.. వసంత ప్రాజెక్ట్స్ పరిసరాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచారు. ఈ ఫ్లాట్స్ అన్నీ ఇప్పటికే నిర్మాణం పూర్తయినవే కావడం విశేషం. “As Is Where Is” ప్రాతిపదికన ఫ్లాట్స్ కేటాయిస్తామని హౌసింగ్ బోర్డు స్పష్టం చేసింది.


గచ్చిబౌలిలో మొత్తం 111 LIG ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో కనిష్ట ధర రూ.26.40 లక్షలు, గరిష్టంగా రూ.36.20 లక్షలు వరకు నిర్ణయించారు. ఫ్లాట్స్ విస్తీర్ణం సుమారు 479 చదరపు అడుగుల నుంచి 636 చదరపు అడుగుల వరకు ఉంటుంది. G+5, G+3, సెల్లార్‌తో కూడిన బ్లాక్స్‌లలో ఈ ఫ్లాట్స్ ఏర్పాటు చేశారు. నగరంలోని ఐటీ హబ్, హాస్పిటల్స్, విద్యాసంస్థలకు దగ్గరగా ఉండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ఆకర్షణగా మారింది.


ఈ ఫ్లాట్స్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ‘లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG)’కి చెందినవారై ఉండాలి. నెలవారీ ఆదాయం రూ.50 వేల లోపు ఉండాలి. లాటరీలో ఫ్లాట్ కేటాయించిన తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి లాటరీ పద్ధతిలో పూర్తిగా పారదర్శకంగా ఫ్లాట్స్ కేటాయిస్తామని హౌసింగ్ బోర్డు వెల్లడించింది.


దరఖాస్తు చేయాలనుకునే వారు రూ.1 లక్ష టోకెన్ అడ్వాన్స్ (EMD) చెల్లించాలి. ఈ మొత్తాన్ని తెలంగాణలోని ఏదైనా మీ–సేవ కేంద్రం ద్వారా చెల్లించి దరఖాస్తు చేయవచ్చు. మీ సేవ కేంద్రాలతో పాటు HYD SRనగర్‌లోని TGHB ఈఈ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. జనవరి 3, 2026 వరకు దరఖాస్తులకు గడువు ఉంది. గచ్చిబౌలి ఫ్లాట్స్‌కు సంబంధించిన లాటరీ డ్రా జనవరి 6, 2026న నిర్మిత్ కేంద్రం, గచ్చిబౌలిలో నిర్వహించనున్నారు.


రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సమయంలో.. రూ.26 లక్షలకే గచ్చిబౌలిలో ఫ్లాట్ అన్న అంశం మధ్యతరగతి.. తక్కువ ఆదాయ వర్గాల ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌లో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. గచ్చిబౌలితో పాటు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనూ తెలంగాణ హౌసింగ్ బోర్డు లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ (LIG) ప్రజల కోసం ఫ్లాట్స్‌ను విక్రయానికి ఉంచింది. పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఇది కీలక నిర్ణయంగా మారింది. పూర్తి వివరాలకు https://tghb.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించండి.


వరంగల్, ఖమ్మంల్లో కూడా..


వరంగల్ నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో 102 LIG ఫ్లాట్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఫ్లాట్స్ G+2 బ్లాక్స్‌లో ఉండగా.. ధరలు సుమారు రూ.19.60 లక్షల నుంచి రూ.21.35 లక్షల వరకు ఉన్నాయి. జనవరి 8, 2026న లాటరీ నిర్వహించనున్నారు. అదేవిధంగా ఖమ్మంలోని శ్రీరామ్ హిల్స్, బోనకల్ రోడ్ ప్రాంతంలో 126 LIG ఫ్లాట్స్ను హౌసింగ్ బోర్డు విక్రయిస్తోంది. ఇక్కడ ఫ్లాట్స్ ధరలు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.21 లక్షల వరకు నిర్ణయించారు. ఖమ్మం ఫ్లాట్స్‌కు సంబంధించిన లాటరీ జనవరి 10, 2026న నిర్వహించనున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫ్లాట్స్ లాటరీ విధానంలో కేటాయించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa