తెలంగాణ రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా దశాబ్దాల కాలంగా నిరీక్షిస్తున్న వరంగల్ మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణ పనుల్లో ఒక కీలకమైన ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది. భూసేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం.. సేకరించిన భూమిని అధికారికంగా భారత విమానయాన సంస్థకు అప్పగించింది.
వరంగల్ జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసింది. శనివారం భారత విమానయాన సంస్థ హైదరాబాద్ జనరల్ మేనేజర్ బి.వి. రావు నేతృత్వంలోని బృందం మామునూరు ప్రాంతాన్ని సందర్శించింది. గతంలో ఈ విమానాశ్రయం పరిధిలో ఉన్న 696.14 ఎకరాలకు తోడు.. తాజాగా సేకరించిన 253 ఎకరాల ప్రైవేటు భూమిని కలిపి మొత్తం సుమారు 950 ఎకరాల భూమిని విమానాశ్రయ అథారిటీకి అప్పగించారు. రైతుల నుంచి సేకరించిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఎకరాకు సుమారు రూ. 1.20 కోట్ల చొప్పున మొత్తం రూ. 295 కోట్లను పరిహారంగా చెల్లించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ ద్వారా రైతుల అభ్యంతరాలను పరిష్కరించి.. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా భూములను స్వాధీనం చేసుకుంది.
రెవెన్యూ, రహదారుల శాఖ అధికారులతో కలిసి విమానయాన సంస్థ బృందం భూమి సరిహద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. త్వరలోనే ఈ భూమి బదలాయింపు పత్రాలను ప్రభుత్వం అధికారికంగా అందజేయనుంది. మామునూరు విమానాశ్రయాన్ని ఒక చిన్న విమానాశ్రయంగా కాకుండా.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య విమానాశ్రయాన్ని ఎంత వేగంగా నిర్మించారో.. అదే వేగంతో దీనిని పూర్తి చేయాలని సంకల్పించింది. కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయం తరహాలో ఆధునిక వసతులు, పచ్చదనంతో దీనిని అలంకరించనున్నారు.
ప్రస్తుతానికి ఉన్న చిన్న రన్‌వేను విస్తరించి.. ప్రారంభంలో 72 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలను నడపనున్నారు. ప్రయాణికుల స్పందనను బట్టి పెద్ద విమానాలు దిగేలా రన్‌వేను మరింత అభివృద్ధి చేస్తారు.
సాధారణంగా శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని ఒప్పందం ఉంది. కానీ.. ప్రభుత్వం ఈ నిబంధనల నుంచి మామునూరుకు మినహాయింపు తీసుకురావడంలో విజయం సాధించింది.
వరంగల్‌కు విమాన సౌకర్యం రావడం వల్ల ఉత్తర తెలంగాణ ఆర్థిక చిత్రం పూర్తిగా మారిపోనుంది. వరంగల్‌లో ఉన్న ఐటీ హబ్, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ఇది కొత్త ఊపిరి పోయనుంది. పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు నేరుగా వరంగల్ చేరుకునే అవకాశం ఉండటంతో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల స్థానిక రవాణా, హోటల్ వ్యాపారాలు పుంజుకుంటాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.
నాలుగు దశాబ్దాల పాటు మూతపడి ఉన్న ఈ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఒక స్పష్టమైన కాలపరిమితిని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2026 జనవరి మాసంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంయుక్తంగా ఈ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించే అవకాశం ఉంది. 2027 చివరి నాటికి మొదటి విమానాన్ని గాల్లోకి ఎగురవేయడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే దీనికి అవసరమైన అన్ని రకాల క్లియరెన్సులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల పర్యవేక్షించారు. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావడంతో మామునూరు విమానాశ్రయ నిర్మాణంలో ఒక అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఇది ఓరుగల్లు ప్రాంత అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవబోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa