ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.4 వేలకే బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ఇస్తామన్న ప్రకటన.. ఎగబడిన జనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 08:48 PM

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం ఆదివారం ఉదయం ఒక్కసారిగా జనసందోహంగా మారింది. ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్స్ దుకాణం కేవలం 4,000 రూపాయలకే ల్యాప్‌టాప్ అందిస్తున్నామంటూ ప్రకటించిన బంపర్ ఆఫర్ ఈ రద్దీకి కారణమైంది. తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు వస్తాయన్న ఆశతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, సామాన్యులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


సదరు సంస్థ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే జనం దుకాణం ముందు క్యూ కట్టారు. గంటలు గడిచేకొద్దీ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. క్యూ లైన్లు ప్రధాన రహదారి వరకు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగే పరిస్థితి ఏర్పడింది.


ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని ఊహించని నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. క్యూలో ఉన్న మహిళలు, వృద్ధులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రద్దీని నియంత్రించడం కష్టంగా మారడంతో.. ముందు జాగ్రత్తగా దుకాణాన్ని తాత్కాలికంగా మూసివేయించారు. భారీ లాభాల కోసం జనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని పోలీసులు నిర్వాహకులను హెచ్చరించారు.


4,000 రూపాయలకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కేవలం మొదటి పది లేదా ఇరవై మందికి మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. కానీ వేల మందిని పిలిపించడం ద్వారా దుకాణదారులు ఉచిత ప్రచారం పొందుతున్నారు. ఇంత తక్కువ ధరకు ఇచ్చే ల్యాప్‌టాప్‌లు కొత్తవి కాకుండా, వాడి పక్కన పెట్టినవి లేదా మరమ్మతులు చేసినవి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీటి నాణ్యత , గ్యారంటీపై స్పష్టత ఉండదు. ఇటువంటి ఆఫర్ల ప్రకటించినప్పుడు ప్రజలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకుని కొన్ని సంస్థలు ఇలాంటి గందరగోళం సృష్టిస్తాయి. తక్కువ ధర అని వెళ్లిన వారు చివరికి నిరాశతో వెనుదిరగడమో లేదా ఎక్కువ ధర పెట్టి వేరే వస్తువులు కొనడమో జరుగుతుంది. డిజిటల్ యుగంలో ల్యాప్‌టాప్ అవసరం పెరగడంతో ఇలాంటి ఆఫర్ల పట్ల ఆకర్షితులు కావడం సహజమే. అయితే.. మార్కెట్ ధర కంటే అతి తక్కువ ధర కనిపిస్తే అది ఎంతవరకు వాస్తవమో సరిచూసుకోవాలి. ముఖ్యంగా రద్దీ ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి సేల్స్ నిర్వహించే సంస్థలు కచ్చితంగా పోలీసు అనుమతి తీసుకోవాలని.. లేదంటే ప్రమాదాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa