ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్స్‌లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం,,,,ఇంటి నుంచే ఓపీ.. 2 వేల కొత్త పడకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 28, 2025, 09:11 PM

పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడమే లక్ష్యంగా నిమ్స్ ఆసుపత్రి ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యవేక్షణలో నిమ్స్ ఆధునీకరణ పనులు వేగవంతమయ్యాయి. గత రెండేళ్లలో సుమారు రూ. 150 కోట్లకు పైగా నిధులతో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అదనపు భవనాల నిర్మాణం పూర్తయితే.. ఆసుపత్రిలో మరో రెండు వేల పడకలు అందుబాటులోకి వచ్చి రోగుల రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది.


 నిమ్స్ ఇప్పుడు కేవలం చికిత్సకే పరిమితం కాకుండా.. పరిశోధనలకు కూడా వేదికగా మారుతోంది. ప్రతి విభాగాన్ని ఏఐతో అనుసంధానించే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ల్యాబ్ టెస్టుల్లో ఏఐని వినియోగిస్తున్నారు, దీని కోసం హైదరాబాద్‌లోని ఐఐటీ, ట్రిపుల్ ఐటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఓపీ సేవలను మరింత సులభతరం చేసేందుకు 'నిమ్స్ యాప్'ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా రోగులు తమ ఇంటి నుంచే డాక్టర్ అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు.


కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే చికిత్సలు నిమ్స్‌లో కేవలం పావు వంతు ధరకే లభిస్తున్నాయి. రూ. 12 కోట్లతో అంతర్గత బ్లీడింగ్, క్యాన్సర్ చికిత్సల కోసం డిజిటల్ సబ్‌ట్రాక్షన్ యాంజియోగ్రఫీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. రూ. 30 కోట్లతో అత్యాధునిక రోబోటిక్ యంత్రాలను సమకూర్చారు. వీటి ద్వారా కిడ్నీ మార్పిడి వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి చికిత్సల్లో నిమ్స్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే 1,100 కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. థలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా వంటి రక్త సంబంధిత జబ్బుల చికిత్సకు నిమ్స్‌ను కేంద్ర ప్రభుత్వం 'సెంటర్ ఫర్ ఎక్సలెన్స్'గా గుర్తించింది.


రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడంతో నిమ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లలో ఆరోగ్యశ్రీ కింద చేసే శస్త్రచికిత్సలు 56 శాతం పెరిగాయి. క్యాన్సర్ రోగుల కోసం డే-కేర్ కీమోథెరపీ, డయాలసిస్ సేవలు కూడా విస్తృతమయ్యాయి. అవయవ మార్పిడి చేసుకుంటున్న వారిలో 90 శాతం మంది ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులే కావడం గమనార్హం. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప ప్రత్యేక చొరవతో సంస్థలో అనేక సంస్కరణలు వచ్చాయి. త్వరలోనే నిమ్స్‌లో మరిన్ని అత్యాధునిక పెట్ స్కాన్‌లు, 38 ఆపరేషన్ థియేటర్లు, 3 క్యాథ్ ల్యాబ్‌లు అందుబాటులోకి వస్తాయి. ఐసీఎంఆర్, విదేశీ యూనివర్సిటీలతో కలిసి 57 అంశాలపై నిమ్స్ ప్రొఫెసర్లు పరిశోధనలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa