జగన్ ప్రభుత్వం తీసుకున్న ‘పాఠశాలల విలీనం’ నిర్ణయంతో దెబ్బతిన్న ప్రాథమిక పాఠశాలలను పూర్వస్థితికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,731 ప్రాథమిక పాఠశాలలు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి తీసుకురావాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అప్పటి నుంచి కోరుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు నిర్వహించిన చర్చల్లో ఆయా అంశాలపై స్పష్టతనిచ్చారు.
విలీనంతో తరలిపోయిన తరగతులను తిరిగి వెనక్కి తీసుకొస్తారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మోడల్ ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించనున్నారు. వెనక్కి తీసుకొచ్చే తరగతులను మోడల్ పాఠశాలల్లో కలిపే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో మోడల్ ప్రాథమిక పాఠశాల లేకపోతే అంతకముందున్న ప్రాథమిక పాఠశాలలోనే కలుపుతారు. 130 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుడి పోస్టు ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది మేలోనే టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. బదిలీలపై త్వరలో చట్టం అమల్లోకి రానుంది. ఆ చట్టం ప్రకారం బదిలీల ప్రక్రియను కచ్చితంగా మే నెలలోనే చేపట్టనున్నారు.