నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్ పైనుంచి కాలు జారి కింద పడడంతో కార్మికుడు మృతిచెందాడు. పరవాడ మండలం, దేశపాత్రునిపాలెం శివారు శేషాద్రినగర్‌లో శుక్రవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శేషాద్రినగర్‌లో జీఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆధ్వర్యంలో అపార్టుమెంట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కూర్మన్నపాలేనికి చెందిన చోడి నాగరాజు(46) ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో నాలుగో అంతస్థు పరంజిపై నిలబడి పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కాలు జారడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు కేజీహెచ్‌కు తరలించారు. నాగరాజును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య అప్పలనర్సమ్మ, కుమారుడు ధనుంజయ్, కుమార్తె నందిత ఉన్నారు. ఇతని స్వస్థలం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్లా గ్రామం. కొంతకాలం నుంచి కుటుంబంతోసహా కూర్మన్నపాలెంలో నివాసం ఉంటున్నాడు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.