ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్1బీ వీసాల లొల్లి.. అమెరికన్లు తమ పిల్లలను సరిగా పెంచడం లేదన్న వివేక్‌ రామస్వామి

international |  Suryaa Desk  | Published : Sat, Dec 28, 2024, 09:04 PM

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లోనే పదవీ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే తన కార్యవర్గాన్ని సిద్ధం చేసుకుంటున్న ట్రంప్.. అందులో కీలక పదవులను భారతీయులకు కట్టబెడుతుండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పటికే వివేక్ రామస్వామి, శ్రీరాం కృష్ణన్ సహా అనేక మందిని తన వద్ద ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఫస్ట్ విధానాన్ని అవలంభించే డొనాల్డ్ ట్రంప్.. విదేశీయులపై మరీ ముఖ్యంగా భారతీయ సంతతికి చెందినవారికి అవకాశాలు ఇవ్వడం పట్ల రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో హెచ్ 1బీ వీసాల అంశంలో కూడా ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో రెండుగా చీలిపోయి వర్గ పోరు నడుస్తోంది. ఇలాంటి తరుణంలో భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


భారత్‌ సహా ఇతర దేశాలకు చెందిన వారిని అమెరికాలో కీలక పదవులు కట్టబెట్టడాన్ని పూర్తిగా ఆపేయాలంటూ మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌) వేదిక మరోసారి సంచలన డిమాండ్‌లు వెల్లువెత్తున్న వేళ.. భారతీయ అమెరికన్‌ వ్యాపార వేత్త, రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన వివేక్‌ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి కారణం అయ్యాయి. మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్న డొనాల్డ్‌ ట్రంప్‌.. భారతీయ అమెరికన్‌ వెంచర్‌ కేపిటలిస్ట్‌ శ్రీరాం కృష్ణన్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సీనియర్‌ విధాన సలహాదారుగా ఇటీవల నియమించడం తెలిసిందే. ఈ నియామకంపై మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వేదిక తీవ్ర విమర్శలు చేస్తోంది.


ఈ నేపథ్యంలోనే వివేక్ రామస్వామి తాజాగా సంచలన ఆరోపణలు చేయడం మరింత వివాదానికి కారణం అయింది. అసలు సమస్య ఇమిగ్రేషన్‌ విధానాల్లో లేదని.. అమెరికా సంస్కృతిలో తమ పిల్లలను పెంచడంలో లోపమే కారణమంటూ ట్విటర్‌లో సుదీర్ఘంగా వ్యాఖ్యానించారు. సహజంగానే అమెరికన్‌ యువతలో నైపుణ్యం ఉందని.. అయితే దాన్ని పెంపొందించడంలో వ్యవస్థాగతంగా విఫలం అవుతున్నారని పేర్కొన్నారు.


గణిత మేధావులు, ఉన్నత విద్యావంతులను వదిలేసి అలంకార పదవుల్లో ఉన్న వారిని పొగిడే సంస్కృతే ఇందుకు కారణమని తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో అమెరికాకు వలస వచ్చి స్థిరపడిన వారు తమ పిల్లలకు మంచి విద్యను అందించి.. వారిని తీర్చిదిద్దడంతోపాటు, క్రమశిక్షణతో పెంచుతున్నారని తెలిపారు. టీవీలు, ఇతర సోషల్ ఈవెంట్లపై వలసకుటుంబాలు ఆంక్షలు పెడతాయని.. ఫలితంగా అలాంటి కుటుంబాల నుంచి మంచి నాయకులు తయారవడం సర్వసాధారణమేనని తేల్చి చెప్పారు.


అయితే వివేక్ రామస్వామి చేసిన ఈ వ్యాఖ్యలపై మాగా(మేక్ అమెరికా గ్రేట్ అగైన్) వేదిక తీవ్రంగా మండిపడింది. వలసదారులకు, హెచ్‌–1బీ వీసాదారులకు అనుకూలంగా వివేక్‌ రామస్వామి మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక ఇలాంటి చర్యలు అమెరికా ఫస్ట్‌ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తాయని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇక ఇమిగ్రేషన్‌ విధానాల వల్లే అమెరికన్లకు అవకాశాల్లేకుండా పోతున్నాయని మరికొందరు పేర్కొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com