బెంగళూరులో టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య ఘటన మరిచిపోక ముందే మరో భార్య బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఉడ్‌బాక్స్ కేఫ్ సహ-వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) మంగళవారం రాత్రి తన ఇంటిలో శవమైన తేలారు. కళ్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్‌లో నివాసం ఉంటోన్న పునీత్.. తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పునీత్ ఖురానా, ఆయన భార్య మానికా జగదీశ్ పహ్వా మధ్య విడాకుల కేసు నడుస్తుండగా.. వ్యాపారం విషయంలో ఇరువురు మధ్య వివాదం కొనసాగుతోన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఉడ్‌బాక్స్ కేఫ్ విషయమై పునీత్, మానికా మధ్య గొడవలు జరుగుతున్నట్టు పోలీసులు తెలిపారు. భార్య వేధింపులతోనే తమ కుమారుడు బలవన్మరణానికి పాల్పడినట్టు ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. వీరికి 2016లో వివాహమైనట్టు తెలిపారు. ఖురానా, మానికా మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన 16 నిమిషాల ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఇరువురి మధ్య బిజినెస్ ప్రాపర్టీ గురించి జరిగిన వాగ్వాదం రికార్డయ్యింది. ‘మనం విడాకులు తీసుకున్నాం.. కానీ, నేను ఇంకా వ్యాపార భాగస్వామినే.. నాకు రావాల్సిన మొత్తం చెల్లించాల్సిందే’ అని పునీత్‌ను ఆమె డిమాండ్ చేయడం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. బాధితుడు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పునీత్ భార్యను విచారణకు హాజరుకావాలని నోటీసు పంపారు.
గతేడాది డిసెంబరు మొదటి వారంలో బిహార్‌కు చెందిన అతుల్ సుభాష్.. బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భార్య నికిత సింఘానియా, ఆమె కుటుంబసభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అతుల్ 24 పేజీల సూసైడ్ లెటర్ రాసి.. దానిని హైకోర్టు, తాను పనిచేసే ఆఫీసు, తల్లిదండ్రులకు మెయిల్ చేశాడు. ఆత్మహత్యకు ముందు తాను చేయాల్సిన ప్రతి పనిని ప్రణాళిక వేసుకుని పూర్తిచేశాడు. అలాగే, అతడు సామాజిక మాధ్యమాల్లో 80 నిమిషాల నిడివి ఉన్న వీడియోను పోస్ట్ చేసి.. తాను ఏ విధంగా భార్య కారణంగా ఇబ్బందులను ఎదుర్కొన్నదీ వివరించాడు. అంతేకాదు, న్యాయవ్యవస్థపై కూడా అతుల్ ఆరోపణలు చేయడం.. విడాకుల కేసు విచారించిన జడ్జి తనను రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలన రేపింది. ఈ కేసులో అతుల్ భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడ్ని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.