ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిహార్ జలయోధుడు.. 13 మందిని కాపాడి అసలైన హీరో అనిపించుకున్న ఓ అంధుడి కథ ఇది

national |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 08:28 PM

అమ్మ కడుపులోంచి బయటకు వచ్చిననాటి నుంచే అతడికి కళ్లు కనిపించవు. కానీ మాట, స్పర్శతో అందరినీ, అన్నింటినీ గుర్తు పట్టగలడు. చిన్నప్పటి నుంచే ఎన్నో తెలివితేటలు కల్గిన ఇతడికి ప్రస్తుతం 35 సంవత్సరాలు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఇతడు అదే పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కేవలం చేపలు మాత్రమే పట్టకుండా.. ప్రమాదవశాత్తు నీటలో పడి మునిగిపోతున్న 13 మంది ప్రాణాలను కాపాడి అసలైన హీరో అనిపించుకున్నాడీ అంధుడు. అంతేనా చెరువులు, నదుల్లో పడి చనిపోయిన వారిని కళ్లు ఉండి కూడా గుర్తించలేని తోటి మత్స్యకారులతో పోటీ పడి మరి మృతదేహాలను వెలికితీశాడు. జల యోధుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆ అంధుడి కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లా దుమ్‌దుమా గ్రామనికి చెందిన 35 ఏళ్ల భుల్లు సాహ్ని పుట్టుకతోనే అంధుడు. అయితే చదువుపై పెద్దగా దృష్టి సారించని ఈయన.. స్పర్శ, వినికిడితోనే మనుషులను గుర్తు పడతాడు.0 కేవలం మనుషులనే కాదండోయ్.. అన్నింటినీ సులువుగా గుర్తంచగలడు. అయితే పుట్టింది మత్స్యకార కుటుంబంలో కావడంతో ఆయన తండ్రి కైలు సాహ్ని.. చిన్నప్పటి నుంచే భుల్లుకు చేపలు పట్టడం నేర్పించాడు. అలాగే ఈత కొట్టడం వంటివి చేయించేవాడు. ఇలా భుల్లు ఈ కళలో విపరీతమైన ప్రావీణ్యం సంపాదించుకున్నాడు.


నీటిలోకి దిగాడంటే.. చేప మాదిరిగానే ఈత కొడుతూ ఎంత దూరమైన క్షణాల్లో ప్రయాణిస్తాడు. ప్రస్తుతం భుల్లు చేపలు పడుతూనే జీవనం సాగిస్తున్నాడు. అలాగే ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత ఐదేళ్లలోనే నీటిలో మునిగిపోతున్న 13 మందిని కాపాడి రికార్డు క్రియేట్ చేశాడు. ఏవైనా పడవలు మునిగిపోవడం, ప్రమాదవశాత్తు ప్రజలు నీళ్లలో పడడం వంటివి జరిగితే వెంటనే ఈయనను సంప్రదిస్తారు జిల్లా ప్రజలు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడడంలో ఏంతో ప్రావీణ్యం కల్గిన భల్లుకు కళ్లు కనిపించకపోయినా.. నీటిలో ఉన్న మనుషులను సులువుగా గుర్తిస్తాడు.


అలా 13 మంది ప్రాణాలను కాపాడిన భుల్లు.. కళ్లు ఉన్నవారు సైతం గుర్తంచలేని మృతదేహాలను కూడా నీళ్లలోంచి వెలికి తీశాడు. మొత్తంగా 14 మృతదేహాలను బయటకు తీసుకువచ్చాడు. అయితే ఎంత ప్రమాదం సంభవించినా ఏమాత్రం జంకకుండా.. భుల్లు సులువుగా నీళ్లలో దిగి ప్రజలను కాపాడుతుంటాడు. అందుకుగాను వాళ్లు ఒక్కొక్కరినీ కాపాడినందుకు 1500 రూపాయల నుంచి 2000 వరకు ఇస్తారట. మృతదేహాలు వెలికితీసినా ఇదే మొత్తంలో అందజేస్తారట.


బిహార్‌కు చెందిన ఈ అంధుడిని అక్కడి వారంతా "జల యోధుడు"గా పిలుచుకుంటారు. నీళ్లలో ఉన్న తనకు మనుషులు ఉన్న చోట ఏదో మెరిసినట్లుగా అనిపిస్తుందని.. తనకు అలాంటి భావన కల్గగానే తడిమి చూస్తానని భుల్లు చెబుతున్నాడు. తనకు దేవుడు ప్రసాదించిన ఈ విద్య వల్లే పలువురిని కాపాడుతూ.. తన కుటుంబాన్ని పోషించుకోగల్గుతున్నాని వివరిస్తున్నాడు. భుల్లు గురించి తెలిసిన ప్రతీ ఒక్కరూ ఆయనను హీరోగానే చూస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com