ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముయిజ్జును దింపేందుకు మాల్దీవుల ప్రతిపక్షంతో చేతులు కలిపిన భారత్.. సంచలన నివేదిక

national |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 08:40 PM

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మెయిజ్జును గద్దె దింపడానికి భారత్‌ కలిసి ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపిస్తూ వాషింగ్టన్ పోస్ట్ వెలువరించిన నివేదిక సంచలనంగా మారింది. మొయిజ్జును అభిశంసన ద్వారా పదవీచ్యుతుడ్ని చేయాలంటే తమకు 6 మిలియన్ డాలర్లు సమకూర్చాలని భారత్‌ను కోరినట్టు నివేదించింది. అధ్యక్షుడిపై అభిశంస ప్రవేశపెట్టి.. దానికి అనుకూలంగా ఓటేసుందుకు మొయిజ్జు పార్టీ ఎంపీలు సహా 40 మందికి డబ్బులు ఇవ్వడానికి మాల్దీవులకు చెందిన ప్రతిపక్ష నాయకులు ప్రతిపాదన చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది.


అయితే, ఈ ఆరోపణలను మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ తోసిపుచ్చారు. ముయిజ్జుకు వ్యతిరేకంగా జరుగుతోన్న కుట్ర గురించి తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. అంతేకాదు, ఇటువంటి చర్యలకు భారత్ ఎప్పుడూ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు. ఆసక్తి రేపుతోన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం తాను ఇప్పుడే చదివానని అన్నారు.


‘అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతున్నట్టు నాకు తెలియదు.. కొంత మంది ఎప్పుడూ ఇలాంటి వాటిలోనే నిమగ్నమై ఉంటారు.. భారత్ కూడా అటువంటి చర్యలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు.. మాల్దీవుల్లో ప్రజాస్వామ్యానికే మద్దతు ఇస్తుంది.. మాకు భారత్ ఎలాంటి నిబంధనలు విధించలేదు’ అని మహ్మద్ నషీద్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.


వాషింగ్టన్ పోస్ట్ ‘మాల్దీవుల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రయత్నం’ అనే శీర్షికతో ప్రచురించిన కథనంలో.. ‘అధ్యక్షుడు అభిశంసనకు ఓటు వేయాలని మాల్దీవుల ప్రతిపక్ష రాజకీయ నాయకులు ముయిజ్జు పార్టీకి చెందిన వారితో సహా 40 మంది ఎంపీలకు లంచం ఇవ్వాలని ప్రతిపాదించారు.. మూడు శక్తివంతమైన క్రిమినల్ ముఠాలు, వివిధ పార్టీలకు చెల్లించడానికి కుట్రదారులు 87 మిలియన్ మాల్దీవుల రూపాయలు లేదా 6 మిలియన్ డాలర్లు కోరారు.. మాల్దీవుల అధికారుల ప్రకారం.. ఈ మొత్తం భారత్ నుంచి కోరారు... భారత గూఢచార సంస్థ ‘రా’కు చెందిన ఒక సీనియర్ అధికారి.. మొయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలల తర్వాత ఆయనను పదవీచ్యుతుడిని చేసే ప్రణాళికను రూపొందించారు’ అని ఆరోపించింది. కాగా, సోమవారం వెలువడిన ఈ నివేదికపై భారత విదేశాంగ శాఖ ఇంకా అధికారంగా స్పందించలేదు. అయితే, మొయిజ్జు ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మాల్దీవుల ప్రతిపక్షాలు భారత్ సాయం కోరారనే ఆరోపణలను తీవ్రంగా ఖండించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


నవంబరు 2023లో జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో మహమ్మద్ ముయిజ్జు విజయం సాధించి, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, భారత్‌తో ఉన్న శతాబ్దాల మైత్రిని పక్కనబెట్టి.. చైనా పంచన చేరేందుకు ముయిజ్జు ప్రయత్నించారు. దీంతో భారత్ మాల్దీవుల సంబంధాలు ఎన్నడూలేనంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారత సైనికులను సైతం మాల్దీవుల నుంచి వెనక్కి పంపి.. గల్లికజ్జాలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో మోదీ లక్షదీవుల పర్యటనపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఈ దెబ్బకు ఆ దేశ ఆర్దిక వ్యవస్థకు కీలకమైన పర్యటక రంగం కుదేలయ్యింది. దీంతో మొయిజ్జు కాళ్లబేరానికి వచ్చారు.


గతేడాది జూన్‌లో జరిగిన నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ముయిజ్జు హాజరయ్యారు. మాల్దీవుల అధ్యక్షుడిగా ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన. ఈ సమయంలో తాను భారత భద్రత ప్రయోజనాలకు భంగం కలిగించేలా వ్యవరించబోనని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com