సీసీఎల్ఏ కార్యాలయంలో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. కానీ రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఏ సమస్యకే ఇంత వరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కబడిగా పని చేయడం మానుకోవాలని హితవుపలికారు. పరిష్కరించగలిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని.. దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంత మేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు.