అనకాపల్లి జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుచేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రతి జిల్లాలో విమానాశ్రయం ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల విస్తరణ, కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో సమీక్ష జరిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ స్టీల్ ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్కు, అచ్యుతాపురం సమీపాన ఎన్‌టీపీసీ హైడ్రోజన్ ప్లాంటు ఏర్పాటు కానున్నందున విమానాశ్రయం అవసరం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. భోగాపురంలో విమానాశ్రయం పూర్తయితే విశాఖ విమానాశ్రయంలో కార్యకలాపాలు ఆగిపోయే అవకాశం ఉంది. అప్పుడు అనకాపల్లి జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు భోగాపురం వెళ్లాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ ఆధీనంలో ఐదు వేల ఎకరాలు ఉంది. మిట్టల్ స్టీల్ ప్లాంటు, బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయించగా మిగిలిన భూమిలో విమానాశ్రయం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. విమానాశ్రయం ఏర్పాటు, స్థల సేకరణపై ఇంకా తమకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని అనకాపల్లి జిల్లా అధికారులు చెబుతున్నారు.