సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గండి బాజ్జి పాల్గొన్నారు. మధ్యాహ్నం భోజనం పథకం ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలిసి హోం మంత్రి అనిత భోజనం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారన్నారు. ‘‘మా నాన్న క్రమశిక్షణతో ముందుకు నడిపించారు. మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తి చదువు. ఆ చదువే రాజకీయాల్లో నాకు పెట్టుబడి అయింది’’ అని హోంమంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అంటే ఎంతో కొంత చిన్న చూపు ఉంటుందని అన్నారు. పుస్తకాలు విలువ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలుసు అని చెప్పారు. చిన్న, చిన్న పిల్లలు కూడా గంజాయి మత్తులో విచక్షణరహితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి రవాణా, గంజాయి సాగు లేకుండా ఈగల్ యాక్షన్ టీం రంగంలోకి దిగిందని అన్నారు. టెక్నాలజీ కూడా ఉపయోగించి గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. సబ్బవరం జూనియర్ కాలేజ్‌లో చిన్న, చిన్న సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.