విజయవాడ పరిధిలోని కేసరపల్లి లైలా గ్రీన్ మెడోస్ ప్రాంగణంలో ఈనెల 5న నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభ ఏర్పాట్లు వేగంతంగా సాగుతున్నాయి. 30 ఎకరాల్లో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. 150మంది స్వామీజీలు కూర్చునేందుకు భారీ స్టేజీ నిర్మిస్తున్నారు. 50 గ్యాలరీల్లో లక్షకు పైగా కుర్చీలు వేస్తున్నారు. సభకు వచ్చిన వారు వీక్షించేందుకు 14 భారీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలికి నాలుగు మార్గాల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌కు కంకిపాడు రోడ్డు, సావరగూడెం రోడ్డులో 150 ఎకరాలకుపైగా భూములను చదును చేస్తున్నారు. అక్కడ మార్కింగ్‌లు వేసి వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేపట్టారు. 3500 బస్సులు, 7రైళ్లు, 20వేల బైకులలో హిందూ కుటుంబీకులు వస్తున్నారని చెబుతున్నారు. రైళ్లల్లో వచ్చేవారికి ఉప్పులూరు స్టేషన్ వద్ద దిగి సభకు వచ్చేటప్పుడు అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. మరుగు దొడ్లు ఏర్పాటు చేశారు. అయోధ్య రామాలయం ట్రస్టు కోశాధికారి గోవిందగిరి మహరాజ్‌తో పాటు దేశంలోనే ప్రధాన స్వామీజీలు హాజరుకానున్నారు. స్టేజీ మీద స్వామీజీలు మాత్రమే కూర్చుంటారు. ఏర్పాట్లను వీహెచ్‌పీ అఖిల భారత ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, కన్వీనర్ తనికెళ్ల సత్య రవికుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పర్యవేక్షిస్తున్నారు.