ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసిన కూటమి నేతలపై 420 కేసులు పెట్టాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. హామీల అమలులో విఫలమైన చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ నయవంచనను భరించే స్థితిలో మహిళలు లేరని అన్నారు. ఎన్నికల సమయంలో అధికారమే పరమావధిగా చంద్రబాబు అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించాడు. రాజకీయాలలో శుష్కవాగ్ధానాలు చేయకూడదు అనే విషయాన్ని ఏనాడు చంద్రబాబు పట్టించుకోలేదు. అక్కచెల్లెమ్మలను మళ్ళీ మళ్ళీ నమ్మించి మోసం చేస్తున్నాడు. ఆయన చేసిన హామీలు నిలబెట్టుకోలేకపోగా జగన్ గారు ఇస్తున్న పథకాలను నిలిపివేసి మహిళలకు తీవ్ర ద్రోహం చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున బ్రాండింగ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా కూటమి నేతలు ఈ హామీలను ఒక పేపర్ లో రాసి, సంతకాలు చేసి మరీ ప్రజలకు వాగ్ధానం చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వీటి ఊసే లేదు. ఆరోజు మీరు పెట్టిన సంతకాల విలువ ఇదేనా? అని ప్రశ్నించారు.