దేశంలో గతేడాది జరిగిన రైలు ప్రమాదాలు ఎంతటి ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయో మనందరం చూశాం. అయితే ఈ రైలు ప్రమాదాల నివారణకు కవచ్ అనే అత్యాధునిక రక్షణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా.. ప్రమాదాలు జరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ వ్యవస్థ అందుబాటులో లేదని.. దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకువచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని రైల్వే శాఖ వెల్లడించింది. క్రమంగా కవచ్ వ్యవస్థను దేశం మొత్తం విస్తరింపజేస్తామని ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. కొత్తగా 10 వేల లోకోమోటివ్‌లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రైలు ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు కవచ్ అనే సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లల్లో ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ-ఏటీపీ కవచ్‌ను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 10 వేల రైళ్లలో ఈ కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. 15 వేల కిలోమీటర్ల మేర ట్రాక్‌సైడ్ ఫిట్టింగ్‌లు చేస్తున్నామని.. ఇంజిన్ల ముందు కెమెరాలు అమర్చుతున్నట్లు వివరించారు. కొత్తగా డిజైన్ చేసిన బోల్ట్లను బిగిస్తున్నారని.. ఈ బోల్ట్లను బయటకు తీయడం సాధ్యం కాదని వెల్లడించారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాలను వివరించారు. ఇటీవల రైలు ప్రమాదాలు, కొందరు దుండగులు పట్టాలపై సిలిండర్లు, సైకిళ్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు సహా వివిధ వస్తువులను ఉంచి.. రైళ్లు పట్టాలు తప్పేలా అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. రైలు ప్రయాణాలను మరింత సురక్షితంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టింది.
విస్టాడోమ్ (అద్దాల బోగీ) కోచ్‌లలో మరికొన్ని మార్పులు చేసినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలను మెరుగుపరిచినట్లు చెప్పారు. పనోరమిక్ వ్యూలను ఆస్వాదిస్తూనే ప్రయాణికులు ఈ విస్టాడోమ్ కోచ్‌లలో డిన్నర్ చేయవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ కొత్త కోచ్‌లను జమ్మూ కాశ్మీర్ సర్వీసుల్లో ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి వివరించారు. ఇక అమృత్ భారత్ రైలు జనరల్ కోచ్‌లోను ప్రీమియం కోచ్‌లో ఉండే సౌకర్యాలు ఉంటాయని.. వందే భారత్‌తో రైళ్లలో నిరంతరం సౌకర్యాలను మెరుగుపరుస్తూనే ఉంటామని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
ఇక ఈ కవచ్ రక్షణ వ్యవస్థ ప్రధానంగా జీపీఎస్ ఆధారంగా పనిచేస్తుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. పట్టాలపై ఏవైనా వస్తువులు అడ్డుగా ఉంటే.. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలెట్ రైలును ముందుకునడిపితే.. కవచ్ వ్యవస్థ అలర్ట్ చేసి.. బ్రేక్‌లు వేసి ప్రమాదాలు జరగకుండా నియంత్రిస్తుందని పేర్కొన్నాయి. ఇక ఆ మార్గంలో.. ఆ రైలుకు నిర్దేశించిన వేగాన్ని మించి రైలు ప్రయాణించకుండా ఈ కవర్చ వ్యవస్థ ఉపయోగపడుతుందని వివరించాయి.