అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే 100కు పైగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ తన నాలుగేళ్ల పాలన ఎలా ఉండబోతోందో స్పష్టంగా వెల్లడించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతామనేది ఆయన ఆర్డర్లలో ఒకటి. దానికి తగినట్టుగానే ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా 500 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందల మందిని అమెరికా నుంచి డిపోర్ట్ చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ట్రంప్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు. వీరంతా లైంగిక నేరాలు, మాదకద్రవ్యాల రవాణా, ఉగ్రవాదం తదితర కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ... గత నాలుగేళ్లలో (బైడెన్ ప్రభుత్వంలో) అక్రమ వలసదారులు పోటెత్తారని చెప్పారు. లక్షలాది మంది సరైన పత్రాలు లేకుండానే దేశంలోకి చొరబడ్డారని తెలిపారు. వీరంతా దేశ భద్రతకు, ప్రజల రక్షణకు ముప్పుగా మారుతున్నారని చెప్పారు. వలసదారుల కట్టడికి గట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.