కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ విషాదకర ఘటన చోటు చేసుకుంది. వయనాడ్ మనంతవాడి సమీపంలోని కాఫీ తోటలో పని చేస్తున్న రాధ (45) అనే మహిళపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసిందని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగిందని... మనుషులపై క్రూర మృగాలు చేస్తున్న దాడులకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పదేళ్లలో క్రూర మృగాల దాడిలో ఎనిమిది మంది మృతి చెందారని వారు తెలిపారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మరోవైపు మహిళను చంపేసిన పులిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అటవీఅధికారులు తెలిపారు. అటవీప్రాంతంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఒంటరిగా బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు