ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు నిందితుడు జనపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై దళిత సంఘం నేత బూసి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో జగన్ ఎందుకు కోర్టుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు.దళిత వ్యక్తిని వేధించాలని ఉద్దేశంతోనే జగన్ ఇలా చేస్తున్నారని బూసి ఆరోపించారు. ఫిర్యాదుదారినిగా జగన్ హాజరుకావాలని, లేదంటే శ్రీనుకి ఎక్స్ పార్టీ, డిక్రి జడ్జిమెంట్ ఇవ్వాలని న్యాయవాది సలీమ్ కోరారు. కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని అన్నారు. దాడి ఘటనలో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ ఎప్పుడో చెప్పిందని వెల్లడించారు. నిందితుడు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్‌పై ఉన్నారని, అతడిని వాయిదాలపై తిప్పకుండా జగన్ కోర్టుకు రావాలని విజ్ఞప్తి చేశారు.