తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. రథసప్తమి వేడుకలు తిరుమలలో మినీ బ్రహ్మోత్సవాల తరహాలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమలలో రథసప్తమి వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లపై అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో శ్యామలరావు.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పలు విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రథసప్తమికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
భక్తులు గ్యాలరీల్లోకి వచ్చే ప్రాంతాలు.. బయటికి వెళ్లే ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఇటీవల తిరుమలలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో మరింత అలర్ట్‌గా ఉండాలని సూచించారు.
రథసప్తమి వేడుకలకు సంబంధించి.. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీవరకు 3 రోజుల పాటు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకెన్లు జారీ చేయడం లేదని ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తులు అందుకు అనుగుణంగా తిరుమల దర్శనాలకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలను రథసప్తమి వేడుకల సందర్భంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ప్రవాస భారతీయులు- ఎన్‌ఆర్‌ఐలు.. చిన్న పిల్లల తల్లిదండ్రులు.. సీనియర్ సిటిజన్లు.. వికలాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలు ఆ రోజుల్లో ఉండవని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.
రథసప్తమి వేడుకల సందర్భంగా ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు తప్ప మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నీ రద్దు చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు.. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని తెలిపారు. ఇక రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు.. ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని భక్తులకు ఈవో సూచించారు.