ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గత ప్రభుత్వ హయాంలో చిత్రహింసలకు పాల్పడిన కేసులో నిందితుడు తులసిబాబుకు కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. తులసిబాబును మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఈ నెల 27 నుంచి 29 వరకు తులసిబాబును కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. రఘరామ కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబు ఏ6గా ఉన్నాడు. నాడు రఘురామను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని తమ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో తన ఛాతీపై కూర్చుని హింసించింది తులసిబాబేనని రఘురామ స్పష్టం చేశారు. దాంతో పోలీసులు తులసిబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు డిస్ట్రిక్ట్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.