పబ్లిక్ ప్లేసులు, హోటళ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి మహిళలను నగ్నంగా రికార్డు చేస్తున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఆ వీడియోలు నెట్ లో ప్రత్యక్షం కావడంతో బాధితులు నరకం అనుభవిస్తున్నారు. తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. దీంతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ నిందితులను పట్టుకుని కటకటాల వెనక్కిపంపిస్తున్నారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరా సాయంతో తన భార్యను నగ్నంగా వీడియో తీశాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై భర్త దాడి చేశాడు. తప్పించుకుని పారిపోతుంటే వెంటపడి మరీ పట్టుకున్నాడు. స్నేహితులతో కలిసి ఆ యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు. అయితే, విచారణలో అసలు విషయం బయటపడడంతో ఆ భర్తతో పాటు పోలీసులు కూడా అవాక్కయ్యారు.అసలు ఏం జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ఆ యువకుడు గీజర్ రిపేర్ పేరుతో తమ ఇంట్లోకి వచ్చాడని, రిపేర్ చేస్తూనే గీజర్ లో సీక్రెట్ కెమెరా అమర్చాడని భర్త చెప్పాడు. తన భార్య స్నానం చేస్తుండగా రికార్డు చేసి ఆ వీడియోను నెట్ లో పెట్టాడని ఆరోపించాడు. అయితే, గీజర్ ఆన్ చేసిన తర్వాత బాగా వేడెక్కుతుందని, అందులో కెమెరా పెట్టే అవకాశమే లేదని పోలీసులు అనుమానించారు. దీనిపై బాధితురాలిని గట్టిగా నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. ఆ వీడియో తీసింది తానేనని బయటపెట్టింది. తనను తాను నగ్నంగా వీడియో తీసుకుని ఆ యువకుడికి పంపానని చెప్పింది. ఆ యువకుడితో తనకు వివాహేతర సంబంధం ఉందని, అతడు కోరడంతో వీడియో తీసుకుని పంపించానని తెలిపింది. ఆ వీడియో చూసి భర్త నిలదీయడంతో తప్పించుకోవడానికి అబద్ధం చెప్పానని బాధితురాలు వివరించింది.