కేంద్ర బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలు ప్రాజెక్టులు పూర్తికావాలంటే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు కీలకం. తలసరి ఆదాయంలో వెనుకబడిన సిక్కోలుపై కేంద్రం కరుణ చూపాలని.. ఈసారి ఆర్థికమంత్రి నిర్మలమ్మ ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో ప్రాజెక్టుల వారీ నిధులు కేటాయించాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టి న మూలపేట పోర్టు, అలాగే పలు చోట్ల ఫిషింగ్ హార్బర్, జెట్టీ నిర్మాణాలు కేంద్ర ప్రభు త్వ సహకారంతో చేపట్టేవే. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించినట్లు అప్పట్లో వైసీపీ గొప్పలు చెప్పుకుంది. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధీనంలో ఉన్న ‘సాగరమాల’ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మారీటైమ్ బోర్డు పోర్టు, హార్బర్ పనులు చేపట్టింది. భావనపాడు(మూలపేట) పోర్టు.. బంగాళాఖాతం తీరాన ఉన్న అటు ఛత్తీ్‌సగఢ్, జార్ఖండ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు కార్గో సేవలు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాటు కానుంది. అలానే తీరప్రాంతానికి ఆనుకుని 16వ జాతీయ రహదారి, ఈస్ట్‌కోస్టు రైల్వే లైన్ తదితరవి అభివృద్ధి చెందనున్నాయి. సుమారు రూ.3600 కోట్ల వ్యయంతో నాలుగు బెర్తులతో ప్రస్తుతానికి నిర్మాణం చేపట్టేలా.. ఏడాది 15 మిలియన్ల కార్గో సేవలు పోర్టు ద్వారా జరిగేలా లక్ష్యంతో ఏర్పాటవుతోంది. 3వేల ఎకరాల పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టు కోసం.. పోర్టు అనుబంధ పరిశ్రమలు ఏర్నాటు చేయాలంటే కేంద్రం నిధులు విడుదల చేయాల్సి ఉంది. మంచినీళ్లపేట వద్ద జెట్టీ, బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ పనుల్లో ఎటువంటి పురోగతి లేదు. దీనిపై కదలిక వచ్చేలే... తీరప్రాంతంలో ప్రత్యక్షంగా మత్స్యకారులకు.. పరోక్షంగా జిల్లా ప్రజలకు ఉపాధి లభించేలా పోర్టు, హార్బర్, జెట్టీ పూర్తయ్యేలా కేంద్రం చొరవ చూపాలి. ఇందుకుగాను నిధులు కేటాయిస్తే ఫలితం ఉంటుందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు.