సచివాలయాల సమూల ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం పూనుకుంది. పూర్తిగా ప్రజోపయోగ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించాలని భావిస్తోంది. ఉద్యోగుల హేతుబద్ధీకరణతోనే అది సాధ్యమని నమ్మి గ్రామ/వార్డు సచివాలయాలను మూడు విభాగాలుగా(ఏ,బీ,సీ) విభజించనుంది. ఈ మేరకు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వులు జారీచేశారు. 2019 అక్టోబరు 2న వైసీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రతి సచివాలయంలో 11 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించింది.
జిల్లా బోర్డు ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టింది. ప్రజలకు స్థానికంగా సేవలందించే పేరిట భారీగా ఉద్యోగులను నియమించింది. అందులో కొందరికి పని తక్కువగా ఉండగా.. మరికొందరిపై విపరీతంగా భారం పడుతోంది. ధ్రువపత్రాల జారీలో డిజిటల్, వెల్ఫేర్ కార్యదర్శులు కీలకంగా వ్యవహరిస్తారు. వీరి సంఖ్య తక్కువగా ఉంది. మరికొన్నిచోట్ల అయితే చాలాశాఖలకు సంబంధించి కార్యదర్శులకు పనిలేకుండా ఉంది. ఉదాహరణకు మత్స్యకారులు లేని సచివాలయాల్లో మత్స్యశాఖకు సంబంధించిన కార్యదర్శులను నియమించారు. వారికి ఎటువంటి పనిలేకుండా పోయింది. అటువంటి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.