అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతూనే వస్తోంది. ఆ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ వివిధ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్నారు.తన దైన శైలిలో పాలన సాగిస్తోన్నారు. అంతర్జాతీయ వేదికలనూ వదలట్లేదు.ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే- ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి బయటికొచ్చారు. ఈ అత్యుత్తమ అంతర్జాతీయ వేదిక నుంచి అమెరికా వైదొలగడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడం కలకలం రేపింది. డబ్ల్యూహెచ్‌ఓకు నిధుల పంపిణీనీ నిలిపివేశారు.ఫలితంగా- కోవిడ్ లాంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందినప్పుడు గానీ లేదా ఇతర అంటువ్యాధులు ప్రబలినపుడు అమెరికా నుంచి రావాల్సిన ప్రత్యేక నిధులు డబ్ల్యూహెచ్ఓకు అందవు. ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్‌లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది.ఇందులో నుంచి అమెరికా తప్పుకోవడం వల్ల వ్యాధులు ప్రబలిన విపత్కర సమయాల్లో పేద దేశాలకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేన్ నుంచి అందే ఆర్థిక సహాయం మందగించి పోయే అవకాశాలు లేకపోలేదు. దీనికి ప్రధాన కారణం- డబ్ల్యూహెచ్ఓకు అతిపెద్ద ఆర్థిక వనరు అమెరికానే కావడం. విపత్కర సమయాల్లో అమెరికా నుంచి నిధులు పంపిణీ ఆగిపోతుంది. దీనిపై అప్పట్లోనే డబ్ల్యూహెచ్ఓ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇప్పుడు తాజాగా ఐక్యరాజ్యసమితికీ డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇస్తారని తెలుస్తోంది. ఐరాస మానవ హక్కుల సంఘం నుంచి బయటికి రావాలని ఆయన భావిస్తోన్నట్లు సమాచారం. మానవ హక్కుల సంఘం నుంచి తప్పుకోవడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై రేపో మాపో ట్రంప్ సంతకం చేయవచ్చని అమెరికా మీడియా తెలిపింది.
ఈ మేరకు అమెరికాకు చెందిన పొలిటికో, నేషనల్ పబ్లిక్ రేడియో ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. వైట్ హౌస్ సీనియర్ ఉద్యోగిని తమ కథనంలో ఉటంకించాయి. ఆ ఉద్యోగి పేరు వెల్లడించలేదు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మానవ హక్కుల సంఘానికి అమెరికా తరఫు నుంచి నిధుల కేటాయింపులు స్తంభించిపోతాయి.ప్రధానంగా- మానవతా దృక్పథంతో ఈ సంఘం అంతర్జాతీయంగా పేద దేశాలు, అక్కడ నిర్వహించే శిబిరాలకు అందే ఆర్థిక సహాయంపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మానవ హక్కుల సంఘం నుంచి ప్రధానంగా పాలస్తీనాకు నిధులు పెద్ద ఎత్తున తరలి వెళ్తోండటం పట్ల ట్రంప్ అభ్యంతరం చేస్తోన్నరని యూఎస్ మీడియా అభిప్రాయపడింది.పాలస్తీనా శరణార్థుల కోసం ప్రత్యేకంగా యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఏర్పాటైంది. దీని ద్వారా ఆ దేశ శరణార్థులు భారీగా లబ్ది పొందడాన్ని ట్రంప్ తప్పు పడుతున్నట్లు పొలిటికో పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ సందర్భంగా ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయొచ్చని అంచనావేసింది.