పోలవరం ప్రాజెక్టు కెపాసిటీని తగ్గించవద్దని లోక్‌సభలో వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే పార్టీలకతీతంగా ఎంపీలతో కలిసి పోరాడేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చలో ఆయన ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు. ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది ప్రధాన ఉద్దేశం. కానీ, 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుంది. ఈ తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినట్లే. ఈ అన్యాయం ఎదిరించేందుకు టీడీపీ ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరు’’ అని మిధున్‌రెడ్డి హెచ్చరించారు.