గుంటూరు జిల్లాలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఓ వృద్ధురాలు పొరపాటున చేసిన పనితో బంగారం మొత్తం పోయిందనుకున్నారు. అయితే లక్కీగా ఆ బంగారం దొరికింది.. ఏం జరిగిందని ఆరా తీస్తే బామ్మ అసలు విషయం చెప్పింది. కొల్లిపర మండలం మున్నంగికి చెందిన కుర్రె వెంకటసుబ్బమ్మ అనే వృద్ధురాలు తన బంగారు నగలను పాత చీరల్లో దాచిపెట్టింది.. దొంగల భయం వల్ల ఆమె ఇలా చేసింది. అయితే ఆ చీరలను పాత దుస్తులు కొనే వ్యాపారికి అమ్మేసింది. ఆ తర్వాత బంగారం ఎక్కడో పోయిందనుకుని.. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెంకటసుబ్బమ్మ తన రెండు బంగారు గాజులు, ఒక గొలుసు (56 గ్రాములు) విలువైన నగలను పాత చీరల్లో దాచింది. రెండు రోజుల క్రితం పాత దుస్తులు కొనే వ్యాపారికి ఆ చీరలను అమ్మేసింది. ఆ తర్వాత ఆమెకు అసలు విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే కొల్లిపర పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఊరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. తెనాలి నందులపేటకు చెందిన తాడిశెట్టి సాంబశివరావు అనే వ్యాపారి ఆ చీరలను కొన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే వ్యాపారికి విషయం తెలిసి పోలీసులకు సమాచారం ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఆ వెంటనే వ్యాపారి సాంబశివరావు కొల్లిపర పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై, సిబ్బంది సమక్షంలో ఆ నగలను వెంకటసుబ్బమ్మకు తిరిగి అప్పగించాడు. ఈ కేసు రాగానే వెంటనే స్పందించి బంగారాన్ని తిరిగి తెప్పించిన పోలీస్ సిబ్బందిని అందరూ ప్రశంసించారు. అలాగే వ్యాపారిని కూడా స్థానికులు అభినందించారు. పోలీసులు వెంటనే స్పందించడం వల్ల బాధితురాలికి నగలు దక్కాయి.. ఆమె చేసిన చిన్న పొరపాటుతోనే ఇదంతా జరిగింది. దీంతో అందరూ ఎంత పనిచేశావ్ బామ్మా అంటూ సరదాగా చర్చించుకున్నారు.
![]() |
![]() |