నందమూరి తారక రామారావు మరణంతోనే తెలుగుదేశం పార్టీ చనిపోయిందని, ప్రస్తుతం నారా చంద్రబాబు నేతృత్వంలోనిది వెన్నుపోటు నుంచి పుట్టిన పార్టీయేనని మాజీ మంత్రి, వైయస్‌ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు వైయస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కుని, అవకాశవాద రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. అయన మాట్లాడుతూ.... తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినం సందర్భంగా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చారు. టీడీపీ అధికారం కోసం పుట్టినది కాదని, ఆవేశంలో పుట్టినదని, ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశంతో పుట్టిన పార్టీ అని చెప్పారు. ఆనాడు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభిస్తే, ఆదే కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానంటూ ఆనాడు చంద్రబాబు బీరాలు పలికిన విషయం మరిచిపోయారా? ఈ రోజు టీడీపీని చంద్రబాబే స్థాపించినట్లుగా మాట్లాడటం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అలానే తమది పేదల కోసం ఎగిరేజెండా అని చంద్రబాబు చాటుకుంటున్నారు. ఏనాడైనా తెలుగుదేశం జెండా ఒంటరిగా ఎగిరిందా? ఎర్రజెండాలు, బీజేపీ, బీఎస్పీ ఆఖరికి కాంగ్రెస్, జనసేన జెండాలను కూడా తమ పక్కన పెడితే కానీ ఆయన జెండా ఎగరలేదు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళే ధైర్యంలేని పార్టీ చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీది. దాని గురించి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ చేయాలని అనుకున్నాం, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత చూస్తే చేయలేకపోతున్నామని అంటున్నారు. దీనినే రేవుదాటిన తరువాత తెప్ప తగలేయడం అనేది. చంద్రబాబు చరిత్ర అంతా కూడా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేయడమే. చంద్రబాబుకు ఊసరవెల్లి ఆదర్శం. సిద్దాంతాలతో పనిలేకుండా అధికారమే పరమావధిగా ఎవరితోనైనా జత కడతారు. ఇది కార్యకర్తల పార్టీ, శాశ్వతంగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఇదే పార్టీలోని కార్యకర్తలను ఆయన ఈసడించుకుంటున్నారు. తన కుమారుడి పదవి కోసం ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అధికారం కోసం బీజేపీతో, తరువాత కమ్యూనిస్ట్ లతో, మళ్ళీ బీజేపీతో, ఇప్పుడు జనసేనతో జత కట్టారు. అవసరం తీరిన తరువాత ఆ పార్టీలను పక్కకుతోసేయడంలో చంద్రబాబు దిట్ట అని అన్నారు.
![]() |
![]() |