ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఎన్ పీ4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్లతో నాంది అన్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 02:00 PM

సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన పీ4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయ‌ని, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేశ్ బుధ‌వారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఎటువంటి నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చెయ్యబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు రూ. 31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారు. రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సీబీజీ ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారు అవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. నేను ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతీ సారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత నేను మర్చిపోలేను. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చెయ్యడమే మా లక్ష్యం. రానున్న అయిదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతాం.ఏపీలో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. ఈ రంగంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. త‌ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో 5 లక్షల ఎకరాల బీడు భూమిని వినియోగంలోకి తీసుకురాబోతున్నాం. నేను యువగళం ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాను. రిలయన్స్ మొదటి సీబీజీ ప్లాంట్ ను కనిగిరిలో ప్రారంభించాను. ప్రకాశం జిల్లాలో ఐదు వేల ఎకరాలు బీడు భూములు ఇచ్చాం. కనిగిరిలో 497 ఎకరాలు కేటాయించాం. కనిగిరి ప్లాంట్ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ హబ్ గా మారబోతుంది. ఇక్కడే ఐదు ప్లాంట్స్ రాబోతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదట గుర్తొచ్చేది పౌరుషం, ప్రేమ. ఇక్కడి ప్రజలకు పౌరుషం ఎక్కువే, ప్రేమ ఎక్కువే. ప్రకాశం జిల్లా ప్రజలకు టీడీపీ అన్నా, చంద్రబాబు అన్నా ఎనలేని ప్రేమ. 2019లో ఎదురుగాలి ఉన్నా టీడీపీని నాలుగు సీట్లలో గెలిపించారు. 2024 లో 10 సీట్లలో టీడీపీ అభ్యర్థులకు ఘన విజయాన్ని చేకూర్చారు. యువగళం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు చూశాను. ప్రకాశం జిల్లాలో యువగళం ఒక ప్రభంజనంగా మారింది. నేను ఆ రోజే చెప్పా, మీరు చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి ఇస్తానని. ప్రకాశం జిల్లా నా గుండెల్లో ఉంటుంది అని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టు బట్టలతో మనం ప్రయాణం ప్రారంభించాం. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాగా పనిచేశాం. అనంతపురంను ఆటోమొబైల్ హబ్ చేశాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలుకు రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీలు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకు అతిపెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే ఆ కంపెనీని గత ప్రభుత్వం రానివ్వలేదు. ఉభయగోదావరి జిల్లాలను ఆక్వా రంగంలో నంబర్-1గా నిలబెట్టాం. ఉత్తరాంధ్రను ఐటీ, ఫార్మా హబ్ గా తయారు చేశాం.2019 నుంచి 2024 వరకూ ఎం జరిగిందో మీరంతా చూశారు. రాష్ట్రంలో విధ్వంస పాలన నడిచింది. కొత్త కంపెనీలు తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను తరిమేశారు. లులూ, అమర్ రాజా, హెచ్ఎస్బిసీ, జాకీ లాంటి అనేక కంపెనీలను బెదిరించి బయటకు పంపేశారు. నేను ఆ రోజే ఛాలెంజ్ చేశా... మీరు తెచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పండి అని. ఇప్పటి వరకూ ఆ సైడ్ నుంచి సౌండ్ లేదు. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం మేం చేశాం. ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన దమ్మున్న పార్టీ టీడీపీ. ఆ హామీ ఇచ్చే నేను అనేక మందితో మాట్లాడాను. అందరూ నీ ధైర్యం ఏంటి అని అడిగారు. నా ధైర్యం ఒక్కటే నా బ్రాండ్ ఒక్కటే దటీజ్ సీబీఎన్ అని చెప్పా. 2024లో సైకో పాలనకు బైబై చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన మొదటి రోజు నుంచే ఉద్యోగాల వేట మొదలుపెట్టాం. యువగళం పాదయాత్ర నాలో మార్పు తెచ్చింది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో ఒక కుగ్రామంలో ఒక తల్లి రోడ్డుపై బోండాలు వేస్తోంది. ఆకలివేస్తోంది, బోండాలు పెట్టమని అడిగా. ఆమెను ఏం కావాలని అడిగాను. మద్యానికి బానిసై నా భర్త చనిపోయాడు, 30ఏళ్లుగా టిఫిన్ కొట్టుపెట్టుకుని జీవనం సాగిస్తున్నా. ఇద్దరు బిడ్డలను చదివిస్తున్నా, వారికి ఉద్యోగాలు కావాలని కోరింది. మరుసటిరోజే సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మ్యానిఫెస్టోలో మొదటిహామీగా 20 లక్షల ఉద్యోగాలు పెట్టాలని కోరాను. మొన్నే ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళా. అక్కడ యాంకర్ ఒక ప్రశ్న అడిగారు. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, కర్ణాటక కు బెంగుళూరు ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ఏమి ఉంది అని అడిగారు. నేను ఆయనకు ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఉన్నారని చెప్పా. ఇప్పటికే 8 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు చేసుకున్నాం. రిలయన్స్, ఎన్‌టీపీసీ, ఆర్సీలార్ మిట్టల్, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఇలా అనేక కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయి. నా లక్ష్యం ఒక్కటే కుటుంబంలో ఒక్క ఉద్యోగం వస్తే ఆ కుటుంబం పరిస్థితులు మారిపోతాయి. పేదరికం లేకుండా చేయ్యాలి అంటే ఉద్యోగాలు కల్పించాలి. 5 ఏళ్లలో రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే నా సింగిల్ టార్గెట్.రిలయన్స్ ఫౌండర్ ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీతో చంద్రబాబుకు మంచి అనుబంధం ఉంది. జామ్‌న‌గ‌ర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు టెలికాం రంగంలో విప్లవం రాబోతుంది అని ధీరూభాయ్ అంబానీతో చెప్పారు. చంద్రబాబుపై నమ్మకంతో ఆ రోజుల్లోనే ధీరూభాయ్ అంబానీ టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఆ తరువాత ఆ అనుబంధం రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీతో కూడా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత నేను ముకేశ్‌ అంబానీని, అనంత్ అంబానీని, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ ని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించాను. ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు... స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో ముందుందని చెప్పాను. 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ఐస్ ) తీసుకొస్తానని హామీ ఇచ్చాను. కానీ 30 రోజులు పట్టింది. అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన ముకేశ్‌ అంబానీ, అనంత్ అంబానీ, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో ఎప్పుడు వచ్చినా నా పాదయాత్ర గుర్తొస్తుంది. నాపై చూపిన ప్రేమ, అభిమానం ఎప్పుడూ మర్చిపోను. కనిగిరిలో ట్రిపుల్ ఐటీకి త్వరలోనే శంకుస్థాపన చేస్తా. కనిగిరి రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్ లో అవసరమైన నిధులిస్తాం. ఆగస్టులో సీఎంను రప్పించి రైల్వేప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తిచేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తాం. తాగునీటి శాఖ మంత్రి, నా సోదరుడు పవనన్న కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించి ఆగిపోయిన జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రతిగడపకు తాగునీరు అందిస్తాం. వైసీపీ నాయకుల దుష్ప్ర‌చారం చూస్తుంటే జాలివేస్తోంది. వారు చేయరు, చేసేవాళ్లను చేయనీయరు. బయోగ్యాస్ ప్లాంటుపై అపోహలు సృష్టిస్తున్నారు. అనవసరంగా అడ్డుపడితే ఎర్రబుక్ లోకి ఎక్కుతారు. నేను మంచి పనిచేయడానికి వచ్చా. అధికారంలోకి వచ్చిన 10నెలల్లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాకు వచ్చా. తప్పుడు ప్రచారం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను. ఆనాడు బీసీ గర్జన పేరుతో మేం ప్రకాశం జిల్లాలో కార్యక్రమం పెడితే ఉదయభాను యాంకర్ గా వచ్చారు. ఆనాడు బీసీ సోదరులపై దాడులను నిలదీశాం. ఉదయభానును ట్రోల్ చేశారు. బీసీ నేతలపై దొంగ కేసులు పెట్టారు. నాపై కూడా 23 కేసులు పెట్టారు. తగ్గేదే లేదని చెప్పాను. 94 శాతం సీట్లతో మీరు మమ్నల్ని గెలిపించారు. మీకు అండగా నిలుస్తాం.పాదయాత్ర సమయంలో సాయంత్రం సరదాగా కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. మన ప్రాంతంలో ఏం మార్పుతేవాలనే విషయమై చర్చించేవాళ్లం. మా ప్రాంతంలో వలసలకు చెక్ పెట్టాలని ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. అది గుర్తుపెట్టుకొని నేను, గొట్టిపాటి మొదటి సీబీజీ ప్లాంట్ కనిగిరిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రిలయన్స్ ఆధ్వర్యాన మొదటి వంద సీబీజీ ప్లాంట్లు ప్రకాశం జిల్లాకు తేవాలని నిర్ణయించాం. ఈ ప్రాంత రైతులు 50 వేల ఎకరాలు కౌలుకు ఇస్తారని ఉగ్ర చెప్పారు. చెప్పిన ప్రకారం భూములిస్తే ఇక్కడే 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. గత పదిరోజులుగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అవిశ్రాంతంగా పని చేశారు. కనిగిరి ప్రజల కోసం ఆయన కష్టపడ్డారు. ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని ఆయన కృషి చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ప్రకాశంజిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ట్రాన్స్ కో ఎండి కీర్తి చేకూరి, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, బిఎన్ విజయకుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, ఎంఎం కొండయ్య, ఏలూరి సాంబశివరావు, కాకర్ల సురేశ్‌, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, 20 సూత్రాల కార్యక్రమం అమలు ఛైర్మన్ లంకా దినకర్, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, యర్రగొండపాలెం ఇన్ ఛార్జి ఎరిక్షన్ బాబు, దర్శి ఇన్ ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరక్టర్ పీఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయో ఎనర్జీ సీఈఓ హరీంద్ర కే త్రిపాఠి, నెడ్ క్యాప్ వీసీ అండ్ ఎండీ కమలాకర్ బాబు, సర్పంచ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com