గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో మొదటి 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం పెరుగుదల కేవలం 2.16 శాతం మాత్రమే నమోదైతే... రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ఏకంగా 8.21% ఉంటుందని అంచనా వేయడం సమర్థనీయమేనా?’’ అని సీఎం చంద్రబాబును ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంకెలను ఎవరైనా ఆర్థికవేత్త లోతుగా పరిశీలిస్తే.. మీ ప్రభుత్వ మొదటి ఏడాది పనితీరు, ఆర్థిక అరాచకాలను కప్పి పుచ్చేందుకే జీఎస్‌డీపీ వృద్ధి రేటును పెంచారన్న వాస్తవం వెల్లడవుతుందని పేర్కొన్నారు. దీని వల్ల రాష్ట్రం విశ్వసనీయతను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర విశాల ప్రయోజనాలు, ప్రతిష్ట, విశ్వసనీయతను కాపాడేందుకు.. జీఎస్‌డీపీలో అతిగా వేసిన అంచనాలను సరిదిద్దుకోవాలని సీఎం చంద్రబాబుకు హితవు పలికారు. ఈమేరకు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఏమన్నారంటే..చంద్రబాబూ..! మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని.. మీ అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించి రాష్ట్రం పురోగమిస్తుందని ప్రజలను నమ్మించడానికి ఎల్లో మీడియా సంస్థలతో కలసి మీరు విశ్రాంతి లేకుండా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఎలా పని చేసిందన్న దానికి భిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. నాడు కోవిడ్ మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ 2019–24లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల పెరుగుదలలో వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 13.57 శాతం మాత్రమే. అదే 2014–19లో కోవిడ్ లాంటి ఇబ్బందులు ఏవీ లేకున్నా సరే రాష్ట్ర అప్పుల వార్షిక వృద్ధి రేటు 22.63 శాతంగా ఉంది. వీటిని బట్టి చూస్తే.. 2019–24 మధ్య రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరు ప్రశంసించ దగ్గదన్నది స్పష్టమవుతోంది అని తెలిపారు.
![]() |
![]() |