ఎక్కడ పోగొట్టుకొన్నాయో అక్కడే తిరిగి సంపాధించుకోవాలనిి కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన వంతు కసరత్తు చేస్తోంది. ఒకపుడు ఏపీలో తన పూర్వవైభావం తెచ్చుకోలేకపోయినా తన ఉనికి మాత్రం చాటుకోవాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ రాష్ట్ర పగ్గాలు సమర్థవంతమైన నేతకు అప్పగించాలని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో ఏపీ కాంగ్రెస్ పార్టీకి త్వరలో అధ్యక్షుడిని నియమించనున్నారు. ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పనితీరు సరిగా లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తప్పించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అధిష్టానం అంతర్గతంగా కసరత్తు చేపట్టింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ ఈ అంశంపై పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీసీసీ చీఫ్‌గా రఘువీరారెడ్డి రాజీనామా చేసిన తర్వాత నియమితులైన శైలజానాథ్ ఆ స్థాయిలో పనితీరు కనబర్చలేదని హైకమాండ్ నిర్దారణకు వచ్చింది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించి, కనీసం తాము ఉన్నామని చాటుకోవాలని భావిస్తోంది.
ఇందుకోసం పార్టీ పగ్గాలు ఎవరు తీసుకుంటారని అన్వేషిస్తోంది. ఈ సీనియర్ల అభిప్రాయాలను సేకరించి ఒక నివేదికను జనవరి నెలాఖరులోగా హైకమాండ్‌కు అందించనున్నారు. ఏపిసిసి చీఫ్ పదవిపై సీనియర్లెవరు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో, పోటీ కూడా నామమాత్రంగానే ఉంది. రాష్ట్ర రాజకీయ చిత్రంలో కనీసం కాంగ్రెస్ పార్టీని ఉనికినైనా చాటగలిగే నాయకుడు కావాలని హైకమాండ్ ప్రయత్నిస్తోంది. పీసీసీ రేసులో ఉన్న చింతామోహన్ కు కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ప్లస్ పాయింట్ కాగా, 67 ఏళ్ల పై వయసు ఉండడంతో ఆయన రాష్ట్ర మంతటా చురుగ్గా తిరిగి పార్టీని గాడిలో పెట్టలేరనే వాదన ఉంది. ప్రస్తుతానికి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ పేర్లు ఏఐసిసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేర్లపై ఇతర సీనియర్ నేతల అభిప్రాయాలను ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్ చాందీ సేకరించనున్నారు. ఇందుకోసం త్వరలో హైదరాబాద్, విజయవాడలలో స్వయంగా పర్యటించేందుకు ఉమెన్ చాందీ పర్యటను ఖరారు చేసుకుంటున్నారు. మాజీ సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, పల్లంరాజు తదితర నేతలను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంది. గిడుగు రుద్రరాజు ఏఐసిసి కార్యదర్శిగా ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర సహాయ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు వైఎస్సార్, కెవిపి సన్నిహితుడిగా పేరుపొందారు. చిన్ననాటి నుంచి కాంగ్రెస్‌లోనే పెరిగిన గిడుగు 52 ఏళ్ల వయసులో ఉండడంతో పార్టీ కోసం చురుగ్గా తిరగ గలుగుతారనే ప్రచారం జరుగుతోంది. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa