జేఈఈ పరీక్షలకు కొత్త షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేయడంతో అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తాజాగా ఏపీలోనూ ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి మే 12వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. జేఈఈ నూతన షెడ్యూల్ కారణంగా కొత్త షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. మరో వైపు ఇంటర్ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలకు కూడా కొత్త షెడ్యూల్ విడుదలైంది. కొత్త షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు మే 9 నుంచి లేదా 13 నుంచి నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. గతంలో మాత్రం మే 2 నుంచి 13 వరకు పదో తరగతి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు మారిన నేపథ్యంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఒకే సారి నిర్వహించడానికి వీలు పడదు. ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లు, ఇతర పరీక్షల సామగ్రిని పోలీస్ స్టేషన్లలో ఉంచాలంటే సమస్యలు తలెత్తుతాయి. పరీక్షల నిర్వహణ కూడా ఒకేసారి సాధ్యపడదని అధికారులు భావిస్తున్నారు.