ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో రాజకీయ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. ఈ తరుణంలో సోమవారం జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది. మంత్రి మృతితో విషాదం నెలకొందని, ఈ సమయంలో వేడుకను నిర్వహించడానికి మనసు రావడం లేదని చిత్ర కథానాయకుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కారణంగా సినిమా వేడుకను వాయిదా వేసినట్లు వివరించారు. ఏపీ మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని పవన్ చెప్పారు. విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడం సరికాదని అన్నారు. వేడుకను వాయిదా వేశామని, ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు.