పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలనే లక్ష్యంతో ఒక కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. అమెరికా–ఇరాన్ (USA–Iran) మధ్య మరోసారి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయని సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ (Islamabad)లో వచ్చే వారం ఇరుదేశాల ప్రతినిధులు సమావేశం కానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.సంఘర్షణను తగ్గించి శాంతి దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా 14 అంశాల అవగాహన ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకం చేసే అవకాశం ఉందని ఆ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల బదిలీ, హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలను తగ్గించడం వంటి కీలక అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని టెహ్రాన్ దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలే చర్చలకు ప్రధాన అడ్డంకులుగా మారినట్లు సమాచారం.చర్చలు సానుకూలంగా సాగితే ఇరుదేశాల మధ్య ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం మరింత కాలం పొడిగించే అవకాశముందని అంచనా.ఇక, ఈ ప్రతిపాదనలపై ఇరాన్ నుంచి త్వరలోనే స్పందన వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు Donald Trump ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ ఉద్దేశపూర్వకంగా చర్చలను ఆలస్యం చేస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. హర్మూజ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”ను మళ్లీ ప్రారంభించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదరకపోతే దాన్ని మరింత విస్తరించి “ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్”గా అమలు చేస్తామని ఆయన హెచ్చరించారు.అదే సమయంలో ఇరాన్ కూడా అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ లేఖ రాశారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా సైనిక చర్యలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు. పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్రమైన పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa