బ్యాంకు రుణం తీసుకోవడం నేడు మధ్యతరగతి జీవితంలో భాగమైపోయింది. సొంత ఇల్లు, కారు, పిల్లల చదువుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గితే సాధారణ రుణగ్రహీతలకు ఎంతో ఊరట లభిస్తుంది. అందుకే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వడ్డీ రేట్లు తగ్గించినప్పుడల్లా ఆ ప్రయోజనం ఎప్పుడు తమకు చేరుతుందా అని రుణగ్రహీతలు ఎదురుచూస్తుంటారు.అయితే 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ చేసిన రేటు కోతల ప్రభావం వినియోగదారులకు పూర్తిగా కాకుండా పాక్షికంగానే చేరిందని బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదిక వెల్లడించింది. వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ బ్యాంకులు అదే స్థాయిలో తగ్గింపు ఇవ్వకపోవడంతో రుణగ్రహీతలకు పూర్తి లాభం దక్కలేదని నివేదిక పేర్కొంది.ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో ఆర్‌బీఐ రెపో రేటును ఫిబ్రవరి 2025లో 6.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గించింది. మొత్తంగా 125 బేసిస్ పాయింట్ల కోత చేసినప్పటికీ, కొత్త రుణాలపై సగటు వడ్డీ తగ్గింపు కేవలం 93 బేసిస్ పాయింట్లకు పరిమితమైంది. ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రేట్లు అయితే మరింత నెమ్మదిగా 45 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గాయి.వడ్డీ రేట్లు పూర్తిగా తగ్గకపోవడానికి ప్రధాన కారణం బ్యాంకుల డిపాజిట్ ఖర్చులు. డిపాజిట్లపై వడ్డీని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉండటంతో బ్యాంకులు రుణ వడ్డీని వెంటనే తగ్గించలేకపోతున్నాయి. అలాగే రుణాలు ఏ బెంచ్‌మార్క్‌కు అనుసంధానమై ఉన్నాయన్నది కూడా వేగాన్ని ప్రభావితం చేస్తోంది. రెపో లింక్డ్ రుణాల్లో మార్పులు త్వరగా కనిపిస్తే, ఎంసీఎల్‌ఆర్ ఆధారిత రుణాల్లో తగ్గింపు నెమ్మదిగా ఉంటుంది.వడ్డీ భారం తగ్గించుకోవాలంటే నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మీ రుణం ఎంసీఎల్‌ఆర్ విధానంలో ఉంటే, దానిని రెపో లింక్డ్ (ఈబీఎల్‌ఆర్) విధానానికి మార్చుకోవడం ద్వారా ఆర్‌బీఐ రేటు తగ్గింపుల ప్రయోజనం త్వరగా పొందవచ్చు. తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుకు రుణ బదిలీ చేయడం కూడా ఒక మంచి ఎంపికగా చెబుతున్నారు.ఉదాహరణకు, రూ.30 లక్షల గృహ రుణాన్ని 8.5 శాతం నుంచి 7.63 శాతానికి మార్చుకుంటే, దీర్ఘకాలంలో సుమారు రూ.4 లక్షల వరకు ఆదా చేయవచ్చు. అయితే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఖర్చులు వడ్డీ ఆదా కంటే తక్కువగా ఉన్నప్పుడే బదిలీ లాభదాయకమవుతుంది.అలాగే మంచి క్రెడిట్ స్కోరు ఉన్నవారికి తక్కువ వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంటుంది. రుణ కాలపరిమితి ఎక్కువగా మిగిలి ఉన్నప్పుడే రుణ బదిలీ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుతం వడ్డీ రేట్లు స్థిరీకరణ దశలో ఉన్నాయని, రాబోయే విధాన నిర్ణయాల వరకు పెద్ద మార్పులు వచ్చే అవకాశం తక్కువని నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రుణగ్రహీతలు తమ రుణాలను సమీక్షించి సరైన విధానానికి మారడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa