|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 08:37 PM
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఒక వ్యక్తి తన ఇంటి స్థలం విక్రయానికి చేసిన వినూత్న ఆలోచన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. చట్టబద్ధత లేకపోయినా ఇంటి యజమాని కంచర్ల రామబ్రహ్మం ప్రవేశపెట్టిన లక్కీ డ్రా విధానం ద్వారా రూ. 16 లక్షల విలువైన ఇంటిని సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పసిపాప సొంతం చేసుకుంది. ఈ కొత్త పద్ధతి వల్ల ఇంటి యజమానికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభం సమకూరింది.
చౌటుప్పల్‌లో రేకుల గదితో సహా ఉన్న 66 గజాల ఇంటి స్థలాన్ని రెండు సంవత్సరాలుగా అమ్ముకోవడానికి ప్రయత్నించినా అమ్ముడుపోకపోవడంతో.. యజమాని రామబ్రహ్మంకు ఈ వినూత్న ఆలోచన తట్టింది. కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ. 500 విలువైన కూపన్‌ను కొనుగోలు చేసి లక్కీ డ్రాలో పాల్గొనాలని ఆయన ప్రకటించారు. ఈ సమాచారాన్ని జాతీయ రహదారి పక్కన.. ఇంటి వద్ద ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయగా.. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
స్థానిక మార్కెట్ ధర ప్రకారం ఈ స్థలం.. గది విలువ రూ. 16 లక్షలు కాగా, రామబ్రహ్మం 3,600 కూపన్లు ముద్రించి విక్రయించారు. దీంతో అతనికి రూ. 2 లక్షలు అదనంగా లాభం వచ్చింది. ముందుగా ప్రకటించిన విధంగా నవంబరు 2న కూపన్లు కొనుగోలు చేసిన వారి సమక్షంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్‌లో లక్కీ డ్రాను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన శంకర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల నలుగురి పేర్ల మీద నాలుగు కూపన్లు కొనుగోలు చేశాడు.
డ్రా తీయగా.. ఆయన పది నెలల చిన్న కుమార్తె హన్సిక కు చెందిన 2307 సీరియల్ నెంబర్ కూపన్‌కు అదృష్టం వరించింది. నిర్వాహకుడు వెంటనే ఫోన్ ద్వారా శంకర్ కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అంతేకాక.. హన్సిక తల్లిదండ్రులు కోరిన సమయంలో ఇంటి రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు. 10 నెలల చిన్నారి పేరు మీద ఇల్లు రావడంతో ఆ కుటుంబ సభ్యులు అనందంలో మునిగిపోయారు. లాటరీ లేదా లక్కీ డ్రా విధానం తెలంగాణలో చట్టబద్ధం కానప్పటికీ.. ఈ వినూత్న విక్రయం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి వినూత్న మార్గాలను అన్వేషించవచ్చని ఈ ఘటన నిరూపించింది.