ఇటీవల మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అరెస్ట్‌లు, జైలు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా ఆదిలాబాద్ జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు భారీ ఊరట లభించింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుదీర్ఘ విచారణ జరిపిన మంచిర్యాల జిల్లా కోర్టు.. బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. బాల్క సుమన్‌తోపాటు మరో ముగ్గురికి కూడా కోర్టు బెయిల్ ఇచ్చింది.
మున్సిపల్ ఎన్నికల వేళ ఫిబ్రవరి 18వ తేదీన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీల కాన్వాయ్‌పై దాడి చేసినట్లు బాల్క సుమన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బాల్క సుమన్ సహా మిగిలిన నిందితులు ఆదిలాబాద్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ మంజూరు సమయంలో మంచిర్యాల జిల్లా కోర్టు నిందితులకు షరతులు విధించింది. బెయిల్‌పై విడుదలైన తర్వాత.. ప్రతీ ఆదివారం రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.
క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటు వినియోగించుకునేందుకు.. మంత్రి వివేక్, ఎంపీ వంశీ కాన్వాయ్‌తో బయల్దేరగా.. వారిపై బాల్క సుమన్ సహా బీఆర్‌ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా.. పరిస్థితి రణరంగంగా మారింది. ఈ క్రమంలోనే ఎస్‌ఐ గంగారాం, కానిస్టేబుల్ నరేష్, కాంగ్రెస్ నేతలు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మంచిర్యాల కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత బాల్క సుమన్ సహా పలువురు నిందితులను ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa