ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అసోంలోని బర్సపర స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియాను పది రోజులు గడవకముందే టీ20 ఫార్మాట్‌లో భారత్ రెండు టీ20 మ్యాచ్‌లలో వరుసగా ఓడించింది. మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.
యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్ చెరో హాఫ్ సెంచరీతో టాప్ ఆర్డర్ లో రాణించారు. ఇషాన్ కిషన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. రింకూ సింగ్ వేగంగా పరుగులు సాధించి ఫినిషింగ్ ప్లేస్ ను ఖాయం చేసుకున్నాడు. తొలి మ్యాచ్ తో పోలిస్తే రెండో మ్యాచ్ లో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. రెండో గేమ్ లో ఆస్ట్రేలియా బౌండరీ శాతాన్ని తగ్గించారు. ప్రసిధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ అందరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లను దెబ్బకొట్టాలని ఎదురుచూస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. మరోవైపు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లలు రాణించకపోవడంతో ఆస్ట్రేలియా కంగారు పడుతోంది. అయితే సిరీస్ ను నిలుపుకోవాలనే ఒత్తిడితో ఉన్న ఆస్ట్రేలియన్లు ఈ మ్యాచ్ లో పుంజుకునే అవకాశం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.