నాటక ప్రదర్శనలను రక్తి కట్టించడం కోసం కొందరు కట్టుతప్పుతున్నారు. వేదికపైనే మూగ జీవాలను క్రూరంగా హింసించడం, వాటి ప్రాణాలతో ఆటలాడుతూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా, ఓ నాటక ప్రదర్శనలో ఏకంగా పందిని చంపి.. దాని మాంసాన్ని భక్షించిన కిరాతకమైన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గంజాం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సంబరాలు, యాత్రల్లో పోటాపోటీగా నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి. ఇందుకోసం రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకూ డిమాండ్ బట్టి చెల్లిస్తారు. ముఖ్యంగా దొండొనాచొ దీక్షల సమయంలో రాత్రంతా నాటక ప్రదర్శనలు సాగుతాయి.
ఆ ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణ కోసం కళాకారులు, నిర్వాహకులు మూగ జీవాల ప్రాణాలతో చెలగాటమడుతుంటారు. ఈ క్రమంలో రలబా అనే గ్రామంలో ‘కంజిఒవళా యాత్ర’ సందర్భంగా నవంబరు 25న రామాయణం నాటక ప్రదర్శన చేపట్టారు. వాలి, సుగ్రీవ పాత్రధారులు వేదికపై రెండు విష నాగులతో ప్రమాదకరంగా ఆటలాడారు. ఇదే వేదికపై ఓ రాక్షస పాత్రధారి బింబాధర గౌడ ప్రేక్షకులంతా చూస్తుండగా.. ఓ పందిని వేదికపై తలకిందులుగా వేలాడదీసి, కత్తితో పొడిచి, దాన్ని మాంసాన్ని భక్షించాడు. ఓ కోడిని కూడా నోటితో కొరికి చంపి అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో సంచలనంగా మారింది. దీనిపై ఒడిశా శాసనసభలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పందిని చంపి తిన్న కళాకారుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాహకుడ్ని కూడా అరెస్టు చేశామని, పాములతో ఆటలాడిన కళాకారుల కోసం గాలిస్తున్నామని బ్రహ్మపుర అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) సన్నీ ఖొఖర్ తెలిపారు.
అయితే, విచారణలో తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో నిందితుడు వెల్లడిస్తూ.. ‘రెండు ట్రూపులు ఒకే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాయి.. పోటీని తట్టుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఏదైనా సంచలనంగా ఉండాలనే పందిని కత్తితో పొడిచి, దాని పేగులు తీయడం... కోడిని మెడ కొరికి చంపడం వంటివి చేశాను’ అని తెలిపాడని స్థానిక ఎస్ప శ్రీనివాస్ సేథి అన్నారు. అయితే, నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు.