పంజాబ్ అమృత్‌సర్‌లో ఉన్న ప్రఖ్యాత స్వర్ణ దేవాలయంలో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ సీనియర్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై గుర్తుతెలియని వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపాడు. ఆయన స్వర్ణ దేవాలయంలో సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగుడు కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ అవువుతోంది.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం దగ్గర వీల్‌చైర్‌పై కూర్చొని సేవాదార్‌గా ఉండగా.. ఓ వ్యక్తి ఆయనకు దగ్గరగా వచ్చాడు. అతి సమీపంలో ఉన్న అతడు ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపాడు. వెంటనే గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది అతడ్ని అడ్డుకుని పక్కకు తోసుకెళ్లడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ కాల్పుల నుంచి సుఖ్‌బీర్ సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే ఆలయంలో భద్రతా సిబ్బంది అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.
సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని నారైన్ సింగ్ చౌరాగా గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.. ఆసమయంలోనే ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం రాజకీయంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని అకాల్ తఖ్త్ తేల్చింది.
ఈ మేరకు పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చి సేవకుడిగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా బాధ్యతల నుంచి తప్పుకుని రాజీనామా చేయాలని ఆదేశించింది. వెంటనే రాజీనామాను ఆమోదించి.. ఆరు నెలల్లోగా పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని సూచించిన సంగతి తెలిసిందే. సుఖ్‌బీర్ మంగళవారం నుంచి ఈ శిక్షను అనుభవిస్తున్నారు.. చేసిన తప్పులను అంగీకరిస్తున్నట్లు రాసి ఉన్న ఓ చిన్న బోర్డును మెడలో వేసుకున్నారు. అలాగే చేతిలో ఈటెతో సేవాదార్‌గా స్వర్ణ ఆలయం దగ్గర ప్రవేశ ద్వారం దగ్గర పనిచేస్తున్నారు.
సుఖ్‌బీర్ మాత్రమే కాదు పలువురు మాజీ మంత్రులకు శిక్షలు విధించారు. వీరు కూడా మంగళవారం నుంచి స్వర్ణ దేవాలయంలో శిక్షలు అనుభవిస్తున్నారు. అయితే సుఖ్‌బీర్ కుడికాలికి దెబ్బ తగలడంతో డాక్టర్లు కట్లు వేశారు.. దీంతో ఆయన ఇలా వీల్‌చైర్‌కు పరిమితం కావడంతో ఆలయం ప్రవేశ్ ద్వారం దగ్గర సేవాదార్‌గా ఉన్నారు. మరో అకాలీదళ్ సీనియర్ నేత, మాజీ మంత్రి బిక్రమ్ సింగ్ మజితియాతో పాటూ మరికొందరు మాజీ మంత్రులు స్వర్ణ దేవాలయంలో అంట్లు తోమగా.. మరికొందరు మరుగు దొడ్లను శుభ్రపరిచారు. అనంతరం స్నానాలు చేసి గురుద్వారాకు వచ్చిన భక్తులకు ఆహారం వడ్డించి, వారు తిన్న ప్లేట్లను కూడా శుభ్రం చేశారు.