దాదాపు 9 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన కొందరు పౌరులు.. భారతదేశంలో అక్రమంగా డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ కేసులో అరెస్ట్ అయిన 8 మంది ఇన్నాళ్లుగా జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా వీరికి ముంబయి కోర్టు శిక్ష విధించింది. ముఖ్యంగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
2015వ సంవత్సరంలో గుజరాత్ తీరంలో కొంత మంది పాకిస్థానీలు అక్రమంగా బోటులో డ్రగ్స్ తరలించే ప్రయత్నం చేశారు. కానీ విషయం గుర్తించిన భారత కోస్ట్‌గార్డు అధికారులు ఆ ముఠాను పట్టుకున్నారు. ముఖ్యంగా బోటులో 11 డ్రమ్ములతో పాటు 20 ప్లాస్టిక్ పౌచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్లాస్టిక్ పౌచ్‌లలో గోధుమ రంగు పొడి ఉంది. అది చూసిన అధికారులకు అనుమానం రాగా అవేంటో చూశారు. అలా అది హెరాయిన్ అని తెలుసుకున్నారు. ముఖ్యంగా 200 కిలోల బరువు ఉన్న ఆ డ్రగ్స్ విలువ 6.96 కోట్ల రూపాయలగా తెలుసుకుని షాక్ అయ్యారు.
వెంటనే 8 మంది పాకిస్థాన్ పౌరులను అరెస్ట్ చేశారు. అలాగే వారి వద్ద నుంచి మూడు శాటిలైట్ ఫోన్‌లు, జీపీఎస్ నావిగేషన్ చార్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును దక్షిణ ముంబయి పోలీసులకు అప్పగించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని జైల్లో ఉంచారు. ఆ తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అలా అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే వస్తుంది. అయితే తాజాగా ఈ కేసుపై ముంబయి కోర్టు విచారణ చేపట్టింది.
ఈక్రమంలోనే ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుమేష్ పుంజ్వానీ నిందితులను గరిష్టంగా శిక్ష వేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇది చూసి మరెవరూ డ్రగ్స్ అక్రమ రవాణా చేయకూడదని వివరించారు. అయితే డిఫెన్స్ న్యాయవాది మాత్రం శిక్ష కాస్త తగ్గించి వేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు.. నిందితులపై కనికరం చూపడానికి నిరాకరించింది. ఈక్రమంలోనే 8 మంది పాకిస్థానీ పౌరులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది.