తరచుగా విమానాల్లో ప్రయాణించే వారికి కిటికీల్లోంచి బయటకు చూడడంపై ఆసక్తి తగ్గిపోతుంది. అలా అని పడుకుందామన్నా కొందరికి నిద్ర పట్టదు. కనీసం ఫోన్ వాడుకుందామనుకన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు. ఇన్నాళ్లూ ఇలాంటి సమస్యలతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కానీ ఎయిర్ ఇండియా సంస్థ ఈ సమస్యలకు చెక్ పెట్టబోతుంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల్లో వైఫై అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రయాణికులను తెగ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ విమానాల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులోకి..!
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికుల అభిరుచికి తగ్గట్లుగా విమానాల్లో వైఫై సేవలను అందిస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా పలు విమానాల్లో ఈ సేవలను ప్రారంభించి.. ప్రయాణికులను ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా ఎయిర్ బస్ A350, బోయింగ్ 787-9, A321neo విమానాల్లో వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇలా దేశీయ విమానాల్లో వైఫై అందించిన మొదటి భారతీయ విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియా నిలించింది.
బ్రౌజింగ్, చాటింగ్ సహా సోషల్ మీడియా వాడకం..!
వైఫై సేవలను ఉపయోగించుకుంటూ ప్రయాణికులు ఏమైనా బ్రౌజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకోవడంతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాటింగ్ కూడా చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లతో పాటు టాబ్లెట్లు, ఐఓఎస్ లేదా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లు అన్నింటికీ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెబుతోంది. అయితే ఇందుకు ఓ షరతు కూడా పెట్టింది. ముఖ్యంగా 10 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణికులు అందరూ వైఫైని కనెస్ట్ చేసుకోవచ్చు.
ప్రయాణికుల ఇష్టాలకు తగ్గట్లుగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చామని.. ప్రతీ ఒక్క ప్రయాణికుడు వైఫై ఉపయోగించుకుని ప్రయాణ సమయంలో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నట్లు ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ రాజేష్ డోగ్రా తెలిపారు. అంతర్జాతీయ సేవల్లో వైఫ్ అందిస్తున్న ఎయిర్ బస్ A350 పైలెట్ ప్రాజెక్టు మాదిరిగానే దేశీయంగా కూడా సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ సహా అంతర్జాతీయ గమ్యస్థానాలకు సేవలు అందిస్తున్న ఎయిర్ బస్ A321neo, బోయింగ్ B787-9 విమానాల్లో కూడా వైఫై సేవలు అందుబాటులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.