BPSC వ్యవహారంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా పట్నాలోని గాంధీ మైదాన్‌లో పీకే గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టారు. అయితే సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆయనను అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.ఇటీవల బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిశోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత రెండు వారాలుగా బీపీఎస్సీ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్నా, ప్రభుత్వంలో ఎలాంటి కదలిక రావట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. పరీక్షను రద్దు చేసి.. కొత్తగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఉద్యోగార్థులు తమ ఆందోళనల్ని ఉద్ధృతం చేయగా.. ప్రశాంత్ కిశోర్ వాళ్లకు మద్దతుగా నిలిచారు.